ప్రభుత్వం మెడలు వంచేలా అమరావతి రైతు ఉద్యమం కొనసాగనుందని ఆయా పార్టీల నేతలు, రాజధాని రైతు నాయకులు స్పష్టం చేశారు. కేంద్రం తలచుకుంటే రాజధానిగా అమరావతి ప్రకటన వెంటనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యమం 800వ రోజుకు చేరిన సందర్భాన్ని పురస్కరించుకుని రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు ‘అమరావతి ప్రజా దీక్ష’ పేరుతో 24 గంటలపాటు చేపట్టిన సామూహిక నిరాహార దీక్ష శుక్రవారం ముగిసింది. గురువారం ఉదయం 9.45 గంటలనుంచి శుక్రవారం ఉదయం 9.45 వరకు దీక్ష చేశారు. దీక్షాపరులు గురువారం రాత్రి సభాప్రాంగణంలోనే నిద్రించారు.
ఆరింటినుంచే నినాదాలు...
శుక్రవారం తెల్లవారుజామున ఆరింటినుంచే నినాదాలు ప్రారంభించారు. 8గంటలనుంచి వివిధ పార్టీల నాయకులు, రాజధాని గ్రామాల రైతులు, మహిళలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. వివిధ పక్షాల నేతలు, ప్రజాసంఘాల నాయకులు దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకుముందు వివిధ పక్షాల నేతలు మాట్లాడారు. అమరావతి విషయంలో ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. ‘చంద్రబాబు అభివృద్ధిలో మొండిగా వెళితే.. జగన్ కక్షసాధింపులో మొండిగా ఉన్నారు. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజలు ఇదే చివరి ఛాన్స్ అని నిరూపించనున్నారు’ అని తెదేపా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ‘వైకాపాకు ఓటేసిన వారు కూడా అమరావతి పోరాటంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీట్లు వస్తే చాలని జగన్ ఆలోచిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలవారు అవసరం లేదని అనుకుంటున్నారు. కేంద్రంలోనూ మోసపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి’ అని ఆయన అన్నారు. ‘ఎన్నికల ముందు జగన్ అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారని చెప్పిన వైకాపా నేతలు అధికారం చేపట్టగానే వెన్నుపోటు పొడిచారు’ అని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు