ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AMARAVATHI FARMERS PADAYATRA IN NELLORE : అడుగడుగునా మద్దతు...అధికార పార్టీ నుంచి వేధింపులు

Amaravathi Farmers Padayatra in nellore district : రాజధాని రైతుల మహాపాదయాత్ర అడుగడుగునా మద్దతు లభిస్తున్నా... అధికార పార్టీ నుంచి వేధింపులు మాత్రం తప్పడం లేదు. మంగళవారం రాత్రి పొదలకూరు మండలం మరపూరు వద్ద అమ్మవారి ఆలయంలో రైతులు బస ఏర్పాటుకు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చినా అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అది సాధ్యపడలేదు. చేసేది లేక ముందు రోజు బసచేసిన అంబాపురానికి రైతులు తిరిగి వెళ్లారు. నేడు మరపూరు నుంచి తిరిగి ప్రారంభంకానున్న యాత్ర మర్రిపల్లి వరకు 12కిలోమీటర్ల మేర సాగనుంది.

By

Published : Dec 1, 2021, 3:06 AM IST

రాజధాని  రైతుల మహాపాదయాత్ర
రాజధాని రైతుల మహాపాదయాత్ర

Amaravathi Farmers Padayatra in nellore district : అమరావతి కోసం రైతులు ప్రశాంతంగా నిర్వహిస్తున్న మహా పాదయాత్రను కొందరు రాజకీయం చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని.. పోలీసులు ఆంక్షల పేరుతో వేధిస్తున్నారని వాపోతున్నారు. కనీసం బస చేసేందుకు స్థలాలు దొరక్కుండా చేస్తున్నారని, ఆశ్రయం కల్పించేందుకు ముందుకొచ్చిన వారిపైనా ఒత్తిడి తెచ్చి అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. రాత్రి పొదలకూరు మండలం మరుపూరు అమ్మవారి ఆలయంలో బస చేసేందుకు రైతులు ఏర్పాటు చేసినప్పటికీ స్థానిక నాయకుల ఒత్తిడితో ఆలయ నిర్వాహకులు అంగీకరించలేదు. దీంతో పాలిచర్లపాడు దగ్గర ఖాళీ స్థలంలో టెంట్లు వేసుకుని ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ వర్షం పడే అవకాశం ఉండటంతో మహిళలు, వృద్ధులు బస్సులో తిరిగి అంబాపురంలో సోమవారం బస చేసిన ప్రాంతానికి వెళ్లారు. అమరావతికి జనం నుంచి వస్తున్న మద్దతు చూసి ప్రభుత్వం ఓర్వలేక కుట్రలకు పాల్పడుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జన నీరాజనాల మధ్య మంగళవారం రైతుల పాదయాత్ర సాగింది. సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. అంబాపురం రోడ్డు కొత్తూరు నుంచి ప్రారంభమైన యాత్ర పొదలకూరు మండలం మరుపూరు వరకు సాగింది. వర్షాలకు రోడ్లు బురదమయమై నడిచేందుకు వీలులేకున్నా.... రైతులు యాత్రను కొనసాగించారు. పోలీసులు అడుగడుగునా ఆంక్షల పేరుతో అడ్డంకులు సృష్టించినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెదేపా నాయకుడు అబ్దుల్‌ అజీజ్, వివిధ సంఘాల నాయకులు రైతులకు మద్దతుగా నిలిచారు. పాదయాత్రలో పాల్గొని వారితో పాటు కలిసి నడిచారు.

Amaravathi Farmers Padayatra in nellore district : ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చిన డిసెంబర్‌ 15వ తేదీకి తిరుపతికి చేరుకుంటామని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపై రోజుకు సాగాల్సిన లక్ష్యాన్ని పెంచుకుని నిర్దేశిత లక్ష్యాన్ని సకాలంలో చేరుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబర్‌ 17వ తేదీ తిరుపతిలో బహిరంగసభ నిర్వహించి.. అమరావతి ఆకాంక్షను రాష్ట్ర వ్యాప్తంగా చాటేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి భార్య సోమిరెడ్డి జ్యోతి పాదయాత్ర చేస్తున్న మహిళా రైతులకు పసుపు కుంకుమ చీరలు పంచి తమ సంఘీభావం తెలిపారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details