న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట జరుగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఐదోరోజు యాత్ర ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం నుంచి ప్రారంభమై ...పెదనందిపాడుకు చేరుకుంది. దారి పొడవునా వివిధ వర్గాల ప్రజలు అంతులేని ఆత్మీయతను కనబరిచారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎదురొచ్చి మరీ మద్దతు పలికారు . మీకు తోడుగా వస్తామంటూ కలిసి నడిచారు. అలసిన రైతులకు ఫలహారాలు అందించారు. కొన్ని చోట్ల హారతులు పట్టి రైతులను ఆహ్వానించారు.
15కిలోమీటర్ల మేర సాగిన యాత్రకు... వేల సంఖ్యలో ప్రజలు మద్దతు తెలిపారు. గుంటూరు నుంచే కాక....ఇతర జిల్లాల నుంచి వచ్చి మరీ సంఘీభావం ప్రకటించారు. కొందరైతే హైదరాబాద్ నుంచి వచ్చి మరీ పాదయాత్రలో పాల్గొన్నారు. భూములిచ్చిన రైతుల త్యాగాల్ని, వారి ఆశల్ని నాశనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
ప్రజల నుంచి వస్తున్న స్పందనతో రాజధాని రైతులు అంతులేని ఆనందం పొందుతున్నారు. అమరావతి అనేది 29 గ్రామాల సమస్యగా పాలకులు చేసిన ప్రచారంతో ఆవేదన చెందామని... ఇప్పుడు వస్తున్న స్పందనే వారికి సమాధానమని అంటున్నారు. పోలీసుల సాయంతో యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రైతులు ఆరోపించారు. తమపై నిఘాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న రక్షకభటులు ...కనీసం ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించడం లేదన్నారు.