అమరావతి ఉద్యమకారులపై వైకాపా నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బంగారం పెట్టుకొని ఉద్యమం చేయకూడదా? ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకొనే ఉండాలా? అని పవన్ ప్రశ్నించారు. అమరావతి పరిరక్షణ సమితి నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఉద్యమానికి, సామాజిక వర్గానికి ముడిపెట్టడం సరికాదని అన్నారు. రాజధానిని మూడు ప్రాంతాల మధ్య సమస్యగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి రైతులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు. రైతులకు న్యాయం చేసే విషయంలో ఎప్పటికీ వెనకడుగు వేసేదిలేదని పవన్ స్పష్టం చేశారు. ‘‘రాజధానిగా అమరావతే ఉంటుందని భాజపా నాకు స్పష్టం చేసింది. రాజధానిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. అధికారికంగా ప్రకటించాక మా పార్టీ కార్యాచరణ చెబుతాం’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.