అమరావతి రైతులు వరుసగా రెండోరోజూ ముగ్గురు కేంద్రమంత్రులను కలిసి రాజధాని ప్రాంతంలో కేంద్ర కార్యాలయాల నిర్మాణాలు మొదలుపెట్టాలని కోరారు. కేంద్ర పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖా మంత్రి హర్‌దీప్‌సింగ్‌పురి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అమరావతిలో పేదల కోసం అప్పటి ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని మొరపెట్టుకున్నారు.
‘2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4,500 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. లబ్ధిదారులను గుర్తించి అడ్వాన్స్ కూడా వసూలు చేసింది. తర్వాత ప్రభుత్వం మారడంతో పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వడంలేదు. ఇళ్ల కోసం అడ్వాన్స్ కింద అప్పులు చేసి డబ్బులు కట్టాం. ఇప్పుడు ఆ రుణాలపై వడ్డీలు కట్టాల్సి వస్తోంది. మా ఇళ్లను మాకు ఇప్పించేందుకు చర్యలు తీసుకోండి’ అని దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ, రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ప్రతినిధులు కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌పురికి విజ్ఞప్తిచేశారు.
అలాగే పెట్రోలియంశాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు అమరావతిలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్, గెయిల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, హడ్కో రీజినల్ ఆఫీసులకు కేటాయించిన స్థలాల్లో ఆ సంస్థల ప్రాంతీయ కార్యాలయాలు, శిక్షణ సంస్థలు నిర్మాణాలు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి ఏపీసీఆర్‌డీఏ ప్రాంతంలో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రెండు కేంద్రీయ విద్యాలయాలకు స్థలాలు కేటాయించినందున వాటి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తిచేశారు.