ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Farmers Padayatra: ముగిసిన అన్నదాతల యాత్ర...అమరావతిని రక్షించాలని స్వామీకి విన్నపం - amaravathi farmers protest

amaravati padayatra: అంక్షలకు ఎదురొడ్డారు.. అడ్డంకుల్ని అధిగమించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్నీ జయించారు. ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా.. 450 కిలోమీటర్లు నిర్విరామంగా నడిచారు. అమరావతి సంకల్పాన్ని రాష్ట్రమంతా చాటిచెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా... దేశ విదేశాల నుంచి వివిధ వర్గాలవారు ఇచ్చిన నైతిక మద్దతుతో... అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనే నినాదంతో.. మహా పాదయాత్రను అకుంఠిత దీక్షతో పూర్తి చేశారు

ముగిసిన అన్నదాతల యాత్ర
ముగిసిన అన్నదాతల యాత్ర

By

Published : Dec 15, 2021, 4:20 AM IST

Updated : Dec 15, 2021, 7:21 AM IST

ముగిసిన అన్నదాతల యాత్ర

amaravati farmers padayatra: "అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాం. అయినా నీ మీద భారం మోపి ముందుకు సాగాం. నీ చల్లని చూపుతోనే మా పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. రాష్ట్ర ప్రజల సంకల్పం సిద్ధించేలా చూడు స్వామీ. అమరావతినే రాజధానిగా కొనసాగించేలా పాలకుల మనసు మార్చు తండ్రీ" అంటూ రాజధాని రైతులు, మహిళలు మోకాళ్లపై కూర్చుని అలిపిరి గరుడ కూడలి వద్ద తిరుమల శ్రీవారికి చేతులెత్తి నమస్కరించారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ అంటూ 44 రోజులుగా చేస్తున్న మహాపాదయాత్ర మంగళవారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో తిరుపతి అలిపిరి గరుడ కూడలికి చేరుకుంది. అక్కడ 108 కొబ్బరికాయలు కొట్టి యాత్రను ముగిస్తున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి నేతలు ప్రకటించారు.

సంఘీభావాల వెల్లువ

ఆధ్యాత్మిక నగరి తిరుపతి అమరావతి నినాదాలతో హోరెత్తింది. మంగళవారం ఉదయం తనపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న రామానాయుడు కల్యాణ మండపం నుంచి యాత్ర ప్రారంభమైంది. పాదయాత్రికులకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. తిరుచానూరు మార్కెట్‌ యార్డు వద్దకు చేరుకోగానే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు ఆధ్వర్యంలో ‘సేవ్‌ అమరావతి...సేవ్‌ ఏపీ’ అని రాసిన ప్ల్లకార్డులను ప్రదర్శిస్తూ రైతులకు స్వాగతం పలికారు.

ఉత్తరాంధ్ర సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి సంఘీభావం ప్రకటించారు. భారీ సంఖ్యలో స్థానికులు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు అలిపిరి వరకు వెంట నడిచారు. రహదారిపై రెండు కి.మీ.లకు పైగా ఎటుచూసినా ఆకుపచ్చని అమరావతి జెండాలను చేతబూనిన ప్రజలు ‘రాష్ట్రం ఒక్కటే.. రాజధాని ఒక్కటే’ అంటూ నినదిస్తూ ముందుకు కదిలారు. ఆర్డీసీ బస్టాండు వద్ద ఉన్న అంబేడ్కర్‌ కూడలి మొత్తం కిక్కిరిసింది. రహదారి వెంట పూలు చల్లుతూ మార్గాన్ని పూలమయం చేశారు. మహిళలకుహారతులిస్తూ పూలదండలతో అలంకరించారు.

తరలివచ్చిన నేతలు

పాదయాత్ర చివరిరోజు కావడంతో వైకాపా మినహా అన్ని పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, తెదేపా నేతలు పులివర్తి నాని, నరసింహయాదవ్‌, ధూళిపాళ్ల నరేంద్ర, శ్రీనివాసరెడ్డి, చెంగల్రాయులు, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, సుగుణమ్మ, భాజపా నుంచి భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్‌, కోలా ఆనంద్‌, రాష్ట్ర పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి, పీసీసీ మాజీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, జనసేన నుంచి పీఏసీ సభ్యులు పసుపులేటి హరిప్రసాద్‌, కిరణ్‌రాయల్‌ పాల్గొన్నారు. వామపక్ష, న్యాయవాదులు భారీగా తరలివచ్చారు.

దారిపొడవునా స్థానికుల సహాయం

మహాపాదయాత్ర పొడవునా స్థానికులు రైతులను ఘనంగా సత్కరించారు. మీ పాదయాత్రకు ఇదే మా మద్దతు అంటూ ఆహార పదార్థాలు అందజేశారు. గాంధీరోడ్డుకు వెళ్లే మార్గంలో పూల, పండ్ల వ్యాపారులు రైతులపై పూలజల్లు కురిపిస్తూ స్వాగతం పలికారు.
*పాదయాత్ర మార్గంలో కొందరు వైకాపా కార్యకర్తలు మూడు రాజధానులకు అనుకూలంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైతులు సంయమనంతో ముందుకు సాగినా... స్థానికులు మాత్రం ఆగ్రహం వ్యక్తంచేశారు. జనసేన కార్యకర్తలు వాటిని చించివేశారు. పాదయాత్ర మార్గంలో పోలీసులను భారీగా మోహరించినా ఎక్కడా ఆటంకాలు కలిగించలేదు.
*యాత్రను ముగించిన సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి, కోకన్వీనర్‌ తిరుపతిరావు, నేతలు రాయపాటి శైలజ, సుధాకర్‌రావు మాట్లాడుతూ యాత్రతో పోరాటం ముగియలేదన్నారు. పోరాటాన్ని ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును అసెంబ్లీలో రద్దు చేసుకుందని, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.

పాదయాత్రికులకు నేటినుంచి దర్శనం

అమరావతి రైతులు శ్రీవారిని దర్శించుకోవడానికి తితిదే ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి 3రోజుల పాటు రోజుకు 500 మంది చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పించారు.

గల్లా జయదేవ్‌ రూ.25 లక్షల విరాళం

రైతుల పాదయాత్రకు ఎంపీ గల్లా జయదేవ్‌ రూ.25 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు అమరావతి ఐకాస కన్వీనర్లు బస కేంద్రంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ప్రకటించారు.

ఇదీ చదవండి:

Lokesh On CPS: మాట మార్చటంలో జగన్ రెడ్డి అంబాసిడర్​ - లోకేశ్

Last Updated : Dec 15, 2021, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details