అమరావతి రైతుల మహాపాదయాత్ర 15వ రోజైన సోమవారం ఉదయం ప్రకాశం జిల్లాలో ఎం.నిడమనూరులో ప్రారంభమై, కె.ఉప్పలపాడు, చిర్రికూరపాడు మీదుగా 15 కిలోమీటర్లు సాగి సాయంత్రం కందుకూరు మండలం విక్కిరాలపేటలో ముగిసింది. రెండురోజులుగా కురిసిన వర్షానికి ఎం.నిడమలూరు నుంచి ఉప్పలపాడు వరకు ఉన్న రోడ్డు బురదమయమైంది. ఆ బురదలోనే మూడు కిలోమీటర్లు పాదయాత్ర ముందుకు సాగింది. ఉప్పలపాడు నుంచి చిర్రికూరపాడు వరకు ఏడు కిలోమీటర్లు మధ్యలో ఎక్కడా గ్రామాలు లేకపోయినా కట్టుబడిపాలెం, జరుగుమల్లి మండలాల ప్రజలు వచ్చి సంఘీభావం తెలిపారు. చిర్రికూరపాడుకు చెందిన 30 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఏడు కిలోమీటర్ల పొడవునా ‘రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతే. రైతుల త్యాగాలు వృథాకావు’ వంటి నినాదాలతో తోరణాలు కట్టారు. పాలేరు వంతెనకు ఇరువైపులా పూలు, అరటిచెట్లు, బెలూన్లతో అలంకరించారు. పాదయాత్రికులతో పొగాకు రైతులు, కూలీలు మాట్లాడుతూ... ‘మీ కష్టం ఊరికే పోదు. మీరు బయటకు వచ్చి ఇబ్బందులపై పోరాటం చేస్తున్నారు. మేం పంటలు పండక, గిట్టుబాటు లేక, చేసిన కష్టమూ మిగలక అగచాట్లు పడుతున్నాం’ అని ఆవేదన పంచుకున్నారు.
ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది: ఐకాస
అమరావతి ఐకాస కోకన్వీనర్ గద్దె తిరుపతిరావు, కన్వీనర్ శివారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... రైతుల ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిందన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై విచారణ మొదలైందని, అమరావతి అంశాన్ని త్వరగా తేల్చాలని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడిందన్నారు. కొండపి, పర్చూరుల ఎమ్మెల్యేలు బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం సంఘీభావం తెలిపారు.