అలుపెరగకుండా సాగుతున్న రాజధాని రైతుల న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్ర (amaravathi farmers news) 26వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా రాజుపాలెం నుంచి ఇవాళ యాత్ర ప్రారంభించారు. రాజ్యాంగం అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌కు నివాళలర్పించి పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని అమరావతి విషయంలో రాజ్యాంగబద్ధంగా న్యాయం జరగాలని రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మనసు మారి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆకాంక్షించారు. నేడు 15 కిలోమీటర్ల మేర రైతుల మహాపాదయాత్ర సాగనుంది.
జనసేన మద్దతు..
రైతుల మహాపాదయాత్రకు కోవూరు వద్ద జనసేన రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఇంటి పక్కనున్న రైతులకు న్యాయం చేయలేని సీఎం రాష్ట్రానికి ఏం చేస్తారని నాదెండ్ల ప్రశ్నించారు. అమరావతి రాజధానిగా ఉండాలన్నదే జనసేన సంకల్పమని స్పష్టం చేశారు. రివర్స్ పాలన తరహాలో రివర్స్ బిల్లుల సంస్కృతి మంచిది కాదని ఆయన హితవు పలికారు.
రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది..
కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి మాహాపాదయాత్రలో పాల్గొని రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పకోలేని పరిస్థితి రావటం బాధాకరమన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమేనన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.