ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిపై సీఎం వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్తాం: రాజధాని రైతులు

సీఎం, మంత్రులు వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్తాం
సీఎం, మంత్రులు వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్తాం

By

Published : Mar 24, 2022, 8:38 PM IST

Updated : Mar 24, 2022, 10:33 PM IST

20:36 March 24

సీఎం, మంత్రులు వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్తాం

అమరావతిపై సీఎం వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్తాం

రాజధాని అమరావతిపై సీఎం జగన్, మంత్రుల వ్యాఖ్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని అమరావతి రైతులు అన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతగా జగన్‌ అంగీకరించలేదా ? అని వారు ప్రశ్నించారు. కోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించినా.. మళ్లీ పాలనా వికేంద్రీకరణ అంటూ మెుండిగా వ్యవహరించమేంటని ముఖ్యమంత్రి జగన్​పై మండిపడ్డారు. రైతులు చేసిన త్యాగాలను అధికార పార్టీ నేతలు అవమానిస్తున్నారన్నారు. చట్టసభలు, కోర్టులంటే సీఎం జగన్‌కు లెక్కలేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా.. ప్రభుత్వం మారటం లేదన్నారు.

"ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా ?. రాజీనామా చేసి అందరూ ఎన్నికలకు వెళ్లండి.. ప్రజలు ఎవరినీ ఆమోదిస్తారో తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 200 మంది రైతుల గుండెలు ఆగిపోయాయి. రాజ్యాంగం, అంబేడ్కర్‌ను అవమానించేలా మంత్రులు మాట్లాడారు. వికేంద్రీకరణ గురించి ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు. అమరావతిని అభివృద్ధి చేస్తే అన్ని జిల్లాలకు ప్రతిఫలాలు అందుతాయి. మా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే కోర్టులో న్యాయం దక్కింది. కోర్టు తీర్పులను కూడా లెక్క చేయని నేతలకు మరి ఎలా చెప్పాలి. చట్టసభల్లో అందరి గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఎన్నికల్లోనే తగిన బుద్ధి చెప్పాలి. సీఎం జగన్‌ ఈసారి మూడు రాజధానుల అంశంపై ఎన్నికలకు వెళ్లాలి." -అమరావతి రైతులు

మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం:పాలనా వికేంద్రీకరణే వైకాపా ప్రభుత్వ విధానమని, రాజధానిపై నిర్ణయం తమ హక్కని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోమని తేల్చి చెప్పారు. రాబోయే తరాల బాధ్యత కూడా తమపై ఉందని, వికేంద్రీకరణబాటలో నడవడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన సీఎం.. హైకోర్టు తీర్పును ప్రస్తావించినట్లు 'పీటీఐ' వార్తా కథనం వెల్లడించింది. రాజధాని విషయంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు.. రాజ్యాంగంతోపాటు శాసనసభకు ఉన్న అధికారాలనూ ప్రశ్నించేలా ఉందని ఆక్షేపించారు.

న్యాయవ్యవస్థపై అచెంచల విశ్వాసం ఉందంటూనే.. ఆ తీర్పు సమాఖ్య స్ఫూర్తికి, చట్టసభల అధికారాలకూ విరుద్ధమన్నారు. చట్టసభకు చట్టాలు చేసే అధికారం లేదంటే న్యాయవ్యవస్థ చట్టాలు చేస్తుందా ? అని ప్రశ్నించారు. రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని.. కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని సీఎం చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంతంపై చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. ఉంటే అప్పట్లోనే.., విజయవాడనో, గుంటూరునో రాజధానిగా ప్రకటించేవారని జగన్‌ వ్యాఖ్యానించారు. కేవలం అమరావతి నిర్మాణం ఒక్కటే ప్రభుత్వ ప్రాధాన్యం కాదని.., రాష్ట్రంలో మిగతా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉటుందనే విషయాన్ని మరువరాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు పీటీఐ వార్తా కథనాన్ని ప్రచురిచింది.

ఇదీ చదవండి

రాజీనామా చేసి 3 రాజధానులపై ప్రజల తీర్పును కోరండి: చంద్రబాబు

Last Updated : Mar 24, 2022, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details