అమరావతి అన్నదాతల నిరసనలు 300వ రోజున రాజధాని గ్రామాల్లో హోరెత్తాయి. మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తును ఉద్యమించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి ప్రాంతాలు నినాదాలతో మార్మోగాయి. ఆకుపచ్చ చీరలు ధరించి మహిళలు నిరసనలో పాల్గొన్నారు. వెలగపూడి దీక్షాశిబిరం వద్ద తెలుగుతల్లి, అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు.
300 రోజులుగా ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు....రాష్ట్రవ్యాప్త మద్దతు లభించింది. విజయవాడలోని గాంధీనగర్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట... మహిళా ఐకాస నేతలు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద... అఖిలపక్షం నిరసన కార్యక్రమం చేపట్టింది. వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులకు 3 రాజధానుల నిర్ణయంతో అన్యాయం జరిగిందని జనసేన నేత రామ్మోహన్ రావు అన్నారు. ధర్మపోరాటంలో అంతిమవిజయం అమరావతి రైతులదేనని.... గుడివాడ తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో రైతులు 12 గంటల నిరాహార దీక్ష చేశారు.