విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర నిర్ణయంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖవాసులకు మద్దతుగా రాజధానిలోని గ్రామాల్లో రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విశాఖ ఉక్కుని, రాజధానిని కాపాడుకుంటామని రైతులు స్పష్టం చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నీరుకొండ, అనంతవరం గ్రామాల్లో రైతులు నిరహార దీక్షలు చేపట్టారు.
రైతుల్నీ అమ్మేయండి..
నష్టాలు వస్తున్నాయని కర్మాగారాన్ని అమ్ముతున్న కేంద్రం.. నష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం సైతం తమను అమ్మేయాలంటూ రైతులు ఎద్దేవా చేశారు. ఉక్కు పరిశ్రమకు మద్దతుగా విశాఖలో పార్టీలకతీతంగా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి వస్తామని నేతలు చేసిన ప్రకటనను రైతులు స్వాగతించారు. అమరావతి రాజధాని కోసం 419 రోజులుగా ఆందోళన చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు.
ఇదీ చదవండి:
ఉద్యోగుల వేతన బకాయిలను 6 శాతం వడ్డీతో చెల్లించండి: సుప్రీం