అమరావతి పరిరక్షణ కోసం రైతుల పోరాటం కొనసాగుతోంది. 245వ రోజు రైతులు, మహిళలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆవేదన తెలిసేలా... తుళ్లూరు మహా ధర్నా శిబిరంలో "అమరావతి తల్లికి సంకెళ్లు" నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. మూడు రాజధానుల పేరుతో పాలకులు ఆటలాడుతున్నారని... అమరావతి తల్లి సంకెళ్లను తెంచేందుకు 5 కోట్ల మంది ప్రజలు తరలిరావాలని మహిళలు పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర పోరాటం తరహాలోనే అమరావతి ఉద్యమం సాగుతోందని కృష్ణా జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ చెప్పారు. అమరావతి కోసం పోరాటం సాగిస్తోన్న వెలగపూడి, మందడం రైతులకు ఆమె సంఘీభావం తెలిపారు. రాజధాని కోసం మహిళలు చేస్తోన్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతుందని విమర్శించారు.