ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బొత్స వ్యాఖ్యలపై రాజధాని రైతుల ఆందోళన - botsa comments on capital city

రాజధాని అమరావతిపై వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ ప్రాంతంలో అగ్గిని రాజేశాయి. రైతులు రోడ్లమీదకొచ్చి ఆందోళనలకు దిగారు. గడచిన 80ఏళ్లలో రాని వరదలు ఇప్పుడు నేతలకు కనిపించాయా అంటూ... నిలదీశారు. తమ జీవనాధారమైవన భూములిచ్చిన తర్వాత... రాజధాని ఇక్కడ లేదంటే తామంతా ఏమైపోవాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.

బొత్స వ్యాఖ్యలపై రాజధాని రైతుల ఆందోళన

By

Published : Aug 26, 2019, 6:01 AM IST

బొత్స వ్యాఖ్యలపై రాజధాని రైతుల ఆందోళన

అమరావతి ముంపు ప్రాంతమని మంత్రి బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. రాజధాని విషయంలో మరోమాటకు తావులేదన్నారు. అమరావతిలో నిర్మాణవ్యయం మిగిలిన ప్రాంతాలకంటే అధికమనే విషయాన్ని మళ్లీ ప్రస్తావించారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సుల్ని పక్కనబెట్టడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్న మంత్రి... రైతుల ఆందోళనకు కారణమయ్యారు.

బొత్స వ్యాఖ్యలకు నిరసనగా రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో రాస్తారోకో చేశారు. దాదాపు 200 మంది రైతులు వాహనాలు ఆపి రహదారిపై బైఠాయించారు. ఈ ఆందోళనల్లో మహిళా రైతులు కూడా పాల్గొన్నారు. కృష్ణానదికి 12లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా... రాజధానిలో ఒక్క ఎకరం కూడా మునగదని రైతులు చెప్పారు. గడిచిన 80ఏళ్లలో రాని వరదలు... ఇప్పుడు కనిపించాయా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. సీఎం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదంటూనే... రాజధానిని మారిస్తే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. సమయానికి కౌలు అందకపోయినా.... ధరలు పడిపోయినా మళ్లీ నిలదొక్కుకుంటామనే ఆశతో బతుకుతున్నామన్నారు. ఇప్పుడు రాజధానిని మారిస్తే తమ బతుకులు రోడ్డున పడతాయని వాపోతున్నారు.

రాజధానిని తరలించకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వివిధ పార్టీల నేతలకు అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పట్లో తమ త్యాగాలను కీర్తించిన పార్టీలు మరోసారి అండగా నిలవాలని కోరుతున్నారు. రైతుల విజ్ఞప్తికి స్పందించిన భాజపా నేతలు ఈనెల 28, 29 తేదీలలో రాజధానిలో పర్యటించనున్నారు. 30,31 తేదీలలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు అండగా నిలుస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండీ... గన్నవరం విమానాశ్రయ కార్గో విభాగం వెలవెల

ABOUT THE AUTHOR

...view details