ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి కల చెదిరింది...అన్నదాతకు కన్నీరే మిగిలింది - ఏపీ మూడు రాజధానుల వార్తలు

అందరం కలుద్దాం.. అద్భుతం చేద్దామన్నారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని కడదాం అన్నారు. ముఖ్యమంత్రే కాదు.. ఆంధ్రప్రదేశ్‌కు దిల్లీని మించిన రాజధానిని కడదామని ప్రధాన మంత్రి కూడా స్పష్టంగా చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్‌ జై అన్నారు. అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు తెలిపారు. అయినా... అపూర్వ రాజధానికి మీ భూములు ఇవ్వాలంటే.. ఆ రైతులు వెంటనే సరే అని అనలేదు. అన్నం పెట్టిన భూముల్ని ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అన్నారు. వారికి నచ్చజెప్పారు. రకరకాలుగా భరోసా ఇచ్చారు. భయం లేదంటూ చట్టాన్ని చూపారు. ప్రభుత్వం మారింది... ‘మూడు రాజధానులు’ అంటూ మాట మార్చింది. అదే అమరావతి కోసం భూములిచ్చిన అన్నదాతల పాలిట పిడుగుపాటులా మారింది.

Amaravathi agitation
Amaravathi agitation

By

Published : Dec 16, 2020, 10:22 PM IST

అమరావతి కలచెదిరింది...అన్నదాతకు కన్నీరే మిగిలింది

నిజానికి.. మీ ప్రాంతంలో రాజధాని కడతాం. భూములివ్వండి అని ప్రభుత్వం అడిగిన వెంటనే వీళ్లంతా ఎగిరి గంతేయలేదు. నేల తల్లితో అనుబంధం పెనవేసుకున్న అందరు రైతుల్లానే వారూ ఆలోచించారు. బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోనని దిగులు పడ్డారు. వచ్చిన అధికారుల్ని.. ‘మా భూములు మీకెందుకివ్వాలి’ అని నిలదీశారు. ఊరూరా సమావేశాలు పెట్టుకున్నారు. సమాలోచనలు చేశారు. భూములిచ్చేందుకు ససేమిరా అన్నారు.

అలాంటి పరిస్థితుల నుంచి వారికి ప్రభుత్వం నచ్చజెప్పింది. రాష్ట్రానికి, భావితరాల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసే రాజధాని నిర్మాణం అని వివరించింది. మీరూ, మేమూ కలసి అంతర్జాతీయ స్థాయి, ప్రజా రాజధాని నిర్మిద్దామని ఒప్పించింది. వినూత్నమైన భూసమీకరణ విధానం ప్రకటించింది. మీ పిల్లలకు ఇక్కడే ఉద్యోగ, ఉపాధిఅవకాశాలు దొరుకుతాయని హామీ ఇచ్చింది. మంత్రులు ఊరూరూ రాజధాని ప్రయోజనాలు వివరించారు. ముఖ్యమంత్రి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడి... వారి డిమాండ్లు ఆమోదించారు. ప్యాకేజీ ప్రకటించారు.

అధికారపక్షమూ.. ప్రతిపక్షాలూ.. రాజధాని అమరావతి విషయంలో నాడు ఒక్కమాటపై నిలిచాయి. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని.. అంశంపై రాజధాని నిర్మాణంపై శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రతిపక్షనేతగా జగన్‌ మద్దతు పలికారు. ఇంత జరిగాక... రాజధానికి అన్ని పక్షాల ఆమోదం ఉందని, భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బందీ కలగదన్న ధీమా రైతులకు కలిగింది. భూములివ్వడానికి అంగీకరించారు.

ప్రభుత్వ ఆలోచనల మేరకు 29 గ్రామాల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించే రాజధాని నగర బృహత్‌ ప్రణాళికను సింగపూర్‌కు చెందిన సుర్బానా-జురాంగ్‌ సంస్థలు రూపొందించాయి. దాన్ని సీఆర్‌డీఏ రాజధానిలోని ఊరూరా ప్రదర్శించింది. రాజధానిని నవ నగరాలుగా నిర్మిస్తామని చెప్పింది. గ్రామసభలు నిర్వహించి ప్రజల అభ్యంతరాలు స్వీకరించింది. ఆ మేరకు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసింది. తమకు చూపించిన, గ్రామసభలు ఆమోదించిన బృహత్‌ ప్రణాళిక ప్రకారమే రాజధాని అని నమ్మి రైతులు భూములిచ్చారు.

అంతేనా... రాజధాని నగరానికి సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పరిపాలన నగర నిర్మాణానికి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శంకుస్థాపన చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని ఆయనా హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతులు, ప్రజల్లో ఇది మరింత భరోసా పెంచింది.

వాస్తవానికి... రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన వారిలో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువ. సీఆర్‌డీఏ ఆ భూములు తీసుకుని వారికి ప్లాట్లు కేటాయించింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన స్థాయిలో రాజధాని నిర్మిస్తేనే ఆ ప్లాట్లకు గిరాకీ ఉంటుంది. 3 రాజధానుల పేరుతో కేవలం అసెంబ్లీ భవనాన్నే ఇక్కడ ఉంచి మిగతావన్నీ తరలిస్తే, ఆ రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. సాగుకు భూమీ లేక, సీఆర్‌డీఏ తమకు కేటాయించిన ప్లాట్‌ను కొనేవారూ లేక ఏం చేయాలన్న ఆందోళనే కొన్ని రోజులుగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

గణాంకాలు పరిశీలిస్తే మొత్తం భూములు ఇచ్చిన వారిలో ఎకరంలోపు రైతులే 20,490 మంది. ఇంతకాలం కిందనేల, పైన ఆకాశాన్ని మాత్రమే నమ్ముకున్న వాళ్లంతా మొదటిసారిగా మధ్యలో పాలకులపై మాటలపై నమ్మకం ఉంచారు. ఆ మేరకు న్యాయం జరగాలన్నదే వారందరి డిమాండ్‌.

అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులు

‍(అమరావతి రైతు ఐకాస చెప్పిన వివరాల ప్రకారం)

విస్తీర్ణం రైతుల సంఖ్య ఇచ్చిన భూమి
ఎకరం లోపు 20,490 10,034
1-2 ఎకరాలు 5,227 7,465
2-5 ఎకరాలు 3,337 10,103
5-10 ఎకరాలు 668 4,420
10-20 ఎకరాలు 142 1,877
20-25 ఎకరాలు 12 269
25 ఎకరాలపైన 5 151
మొత్తం 29,881 34,319

వీరిలో సుమారు 3,239మంది అసైన్డ్‌ రైతులు 2,628ఎకరాల భూమి ఇచ్చారు.

ఇదీ చదవండి :365 రోజుల అమరావతి ఉద్యమానికి.. 365 సెకన్ల దృశ్యరూపం..

ABOUT THE AUTHOR

...view details