ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తుళ్లూరు నుంచి షికాగో వరకూ జై అమరావతి నినాదం - రాజధాని రైతుల పోరు న్యూస్

పోరాటం ఆగలేదు... పోరు తీరు మారింది. దేశచరిత్రలోనే తొలిసారి వర్చువల్‌గా నిర్వహించిన అతిపెద్ద ఆందోళనగా అమరావతి ఉద్యమం నిలిచింది. రైతుల పోరాటం 200వ రోజు సందర్భంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి రాజకీయ, ప్రజాసంఘాల మద్దతు లభించి విజయవంతమైంది. కరోనా కాటుకి భౌతిక దూరం తప్పనిసరి కావడంతో సాంకేతిక వినియోగం ద్వారా రాజధాని రైతులు తమ ఆవేదనను వర్చువల్ వేదికగా వినిపించి గోడు వెళ్లబోసుకున్నారు.

amaravathi 200 days virtual protest
amaravathi 200 days virtual protest

By

Published : Jul 5, 2020, 4:18 AM IST

Updated : Jul 5, 2020, 4:30 AM IST

భారీ ర్యాలీలు లేవు...కానీ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు వినిపించాయి. బహిరంగ ప్రదర్శనలు లేవు....ప్రపంచానికి మాత్రం వారి ఆత్మఘోష అర్థమైంది. పోలీసుల బందోబస్తు.. ముందస్తు అరెస్ట్‌లు, హెచ్చరికలు అంతకన్నా లేవు....కానీ రాజధాని రైతులు చేసిన 200వ రోజు ఉద్యమం అందరినీ ఔరా అనిపించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తిని తీసుకుని రాజధాని రైతులు కదం తొక్కారు. కరోనా దృష్ట్యా... వర్చువల్‌గా నిర్వహించిన రాజధాని పోరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంద్రులు ప్రత్యక్షంగా వీక్షించి వీరికి మద్దతు పలికారు. రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి పీఠాధిపతులు, ప్రజాసంఘాలు అంతా సామాజిక మాధ్యమం ద్వారా ఒకే వేదికపైకి వచ్చి రాజధానిగా అమరావతే ఉండాలంటూ మద్దతు తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించారు.

ట్విటర్​లో 'అమరావతి' హోరు

రాజధాని ఉద్యమం 200వరోజుకు చేరిన సందర్భంగా కొవిడ్ నిబంధనల దృష్ట్యా జూమ్ యాప్ ద్వారా నిరసన కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహించారు. 29 గ్రామాల ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ తమ నివాసాలు, దీక్షా శిబిరాల్లో నిరసన దీక్షకు కూర్చున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. మంగళగిరి తెదేపా కార్యాలయంలో ముఖ్యనేతలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 వేదికలపై నుంచి జూమ్ యాప్‌ ద్వారా అమరావతికి మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. ట్విట్టర్‌ ట్రెండింగ్‌లోనూ తొలి నాలుగు స్థానాల్లో ఈ కార్యక్రమం చోటు దక్కించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి 5 లక్షల 61 వేల మంది అమరావతి ఆందోళనకు మద్దతుగా ట్వీట్లు చేశారు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ద్వారా లక్షలాది మంది ప్రత్యక్షంగా వీక్షించారు. రైతులందరినీ జూమ్‌ యాప్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొనేలా సన్నద్ధం చేయడం, ఇంటర్నెట్‌ సౌకర్యం లేని ప్రాంతవాసులూ కార్యక్రమం తిలకించేలా అమరావతి ఐకాస ఏర్పాట్లు చేసింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా డిజిటల్ ఫ్లాట్‌పామ్‌పై అమరావతి ఉద్యమం ప్రతిధ్వనించింది.

తుళ్లూరు టూ చికాగో

మొత్తంగా తుళ్లూరు నుంచి షికాగో వరకు జై అమరావతి నినాదం మిన్నంటింది. గల్లీ నుంచి దిల్లీ వరకు రాజధాని రైతుల ఘోష వినిపించింది. రాజకీయ పార్టీల నాయకులు, ఆధ్యాత్మిక, సామాజిక వేత్తలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు ఆందోళనలో పాల్గొని మద్దతు ప్రకటించారు. అమరావతికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. అమెరికా సహా వివిధ దేశాల్లోని 300 నగరాల్లో ప్రవాసాంధ్రులు సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా, ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, దుబాయ్‌ తదితర దేశాల్లోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. రాజధాని పోరాటానికి మద్దతుగా సినీ నిర్మాత ఆశ్వనీదత్‌ రూపొందించిన వీడియో గీతాన్ని ప్రదర్శించారు.

అమరావతి ఉద్యమానికి మద్దతుగా వంగవీటి రాధ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రాజధానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలను వైకాపా నేతలు అవహేళన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో శనివారం రాత్రి సైతం అమరావతి వెలుగు పేరిట నిరసన కార్యక్రమాలను రైతులు, మహిళలు చేపట్టారు. 29 గ్రామాల్లో ప్రజలు ఇళ్ల ముందు కొవ్వొత్తులు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తుళ్లూరు, మందడం, దొండపాడు, బోరుపాలెం, వెంకటపాలెం, వెలగపూడి గ్రామాల్లో రైతులు, మహిళలు సామాజిక దూరం పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఇదీ చదవండి:200వ రోజు... ఉద్ధృతంగా అమరావతి రైతుల పోరు

Last Updated : Jul 5, 2020, 4:30 AM IST

ABOUT THE AUTHOR

...view details