డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ - తెలంగాణ(దోస్త్) తొలి విడతలో 1,12,683 మందికి డిగ్రీ సీట్లు దక్కాయి. వారిలో 91 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే చేరనున్నారు. ఐచ్ఛికాలు ఇచ్చుకున్న వారికి శనివారం సీట్లు కేటాయించారు. దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం 1,44,300 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నా.. వారిలో 1,18,898 మందే ఐచ్ఛికాలు ఇచ్చుకున్నారని తెలిపారు. వారిలో 1,12,683 మందికి సీట్లు దక్కాయని, చాలా తక్కువ ఆప్షన్లు నమోదు చేసినందున 6,215 మంది సీట్లు పొందలేకపోయారని చెప్పారు.
మొత్తం విద్యార్థుల్లో 77 శాతం మందికి మొదటి ఛాయిస్‌లో సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు దోస్త్ అభ్యర్థి లాగిన్‌లో తగిన ఫీజు చెల్లించి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా వాటిని రిజర్వు చేసుకోవాలి. ఈ నెల 7 నుంచి 22వ తేదీ వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు కొనసాగుతాయని వారు తెలిపారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు, దోస్త్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్ గజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు...
*సీట్లు పొందినవారిలో 45,743 మంది అబ్బాయిలు(40.59 శాతం) ఉండగా.. 66,940 మంది(59.41 శాతం) అమ్మాయిలున్నారు.