అభివృద్ధికి అడ్డుపడుతున్నందునే మండలి రద్దు నిర్ణయమన్న మంత్రి ఆళ్లనాని రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడేందుకు తెదేపా అన్ని విధాల ప్రయత్నిస్తోందని మంత్రి ఆళ్ల నాని ఆరోపించారు. మండలి రద్దు తీర్మానంపై ఆయన శాసనసభలో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్ పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. దురుద్దేశంతోనే మండలిలో రాజధానుల బిల్లులకు తెదేపా అడ్డుపడుతోందన్నారు. అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి వారి భూములను కాపాడుకోవడానికే తెదేపా నేతలు అమరావతి జపం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన స్థాయిని సైతం మర్చిపోయి.. గ్యాలరీలో కూర్చొని శాసన మండలిని ప్రభావితం చేశారని ధ్వజమెత్తారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపేందుకు మండలి ఛైర్మన్‌పై ఒత్తిడి చేశారని అన్నారు. అమరావతిని రాజధానిగా చేసే సమయంలో చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీ సూచనలను పట్టించుకోలేదన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని శాసనమండలి రద్దు తీర్మానం తెచ్చామని మంత్రి తెలిపారు. శాసన మండలి అన్నది శాసనసభకు సూచనలు, సలహాలు ఇచ్చేదిగా ఉండాలి కానీ, అడుగడుగునా అడ్డుపడేలా ఉండకూడదన్నారు. ఈ కారణాలతోనే శాసనమండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఆళ్ల నాని శాసనసభలో జరిగిన చర్చలో తెలిపారు.
ఇదీ చదవండి: