ఫైబర్‌నెట్ వివరాలన్నీ అందుబాటులోనే ఉన్నాయని ఏపీ ఐటీ శాఖ మాజీ సలహాదారు హరిప్రసాద్ వేమూరి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి సామాన్య కుటుంబానికి రూ.149కే టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. 1.20 కోట్ల ఇళ్లకు ఫైబర్‌నెట్ అందించాలని భావించారని వివరించారు. ప్రయోగాత్మకంగా 10 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు అవసరమైన సెట్‌టాప్ బాక్సుల కోసం టెండర్లు పిలిచారన్నారు. కొరియన్ కంపెనీ దాసాన్, దేశీయ కంపెనీలు సహా ఆరు ముందుకు వచ్చాయని చెప్పారు.
ఫైబర్‌నెట్ వివరాలన్నీ అందుబాటులోనే..
ఏపీ ఫైబర్‌నెట్‌కు సంబంధించిన ఒప్పందాలు, కొనుగోలు డాక్యుమెంట్ల వివరాలన్నీ అంతర్జాలంలో అందుబాటులోనే ఉన్నాయని ఏపీ ఐటీ శాఖ మాజీ సలహాదారు హరిప్రసాద్ వేమూరి తెలిపారు. రాజకీయ మనుగడ కోసం వ్యక్తుల లక్ష్యంగా ఆరోపణలు చేయడం గర్హనీయమని అన్నారు.
ఈ బాక్సుల్లో అవినీతి జరిగిందని, రూ.1200 ఉన్న బాక్సును రూ.4వేలకు కొన్నారంటూ ఆరోపిస్తున్నారని తెలిపారు. జీ-పాన్ సాంకేతికతతో టీవీ, వైఫై రోటర్, ఫోన్ కనెక్షన్‌ను అందించే బాక్సును రూ.3,900లకు అందించేందుకు దాసాన్ కంపెనీ ఎల్ 1గా నిలిచిందని అన్నారు. మిగిలిన కంపెనీలు మూడు సదుపాయాలకు మూడు వేర్వేరు బాక్సులు ప్రతిపాదించగా, దాసాన్ కంపెనీ కాంబోబాక్సును ఇస్తామనడంతో 10 లక్షల బాక్సుల కొనుగోలుకు టెండర్లను అప్పగించారని చెప్పారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బాక్సుల కొనుగోలు, ఇతరత్రా అన్ని సదుపాయాలకు రూ.770 కోట్ల వరకు వెచ్చించారని.. ఈ వివరాలను ప్రస్తుత ఏపీ ఫైబర్‌నెట్ అధికారులను ఎవరినడిగినా చెబుతారని స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా రూ.2000 కోట్లు, రూ.4000 కోట్ల అవినీతి అంటూ ఆరోపించడం ఆశ్చర్యకరమన్నారు. నిబద్ధతతో పని చేసినపుడు ఇలాంటి ఆరోపణలను ఎదుర్కోవడం ఎంతో బాధ కల్గిస్తోందని వాపోయారు. తనను ఎప్పుడు, ఎవరు పిలిచినా, ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఇదీ చదవండి :'ఎస్సీలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.. డీజీపీ గారూ సమీక్షించండి'