Independence Day celebrations in Golconda: స్వాతంత్ర్య వేడుకలకు గోల్కొండకోట ముస్తాబైంది. వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ అధికారులు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ ఉదయం పదిన్నరకు గోల్కొండ కోటకు చేరుకుని పోలీస్ శాఖ గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ పతాకావిష్కరణకు వస్తున్న సందర్భంగా దాదాపు వేయి మంది కళాకారులు కేసీఆర్‌కు స్వాగతం పలుకుతారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ అనంతరం పోలీస్ దళాలు రాష్ట్రీయ సెల్యూట్ చేస్తాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీ చేశారు. మొత్తం కార్యక్రమాన్ని వీక్షించడానికి వీలుగా సమాచార శాఖ ప్రత్యేక తెరలను కూడా ఏర్పాటు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే వారికి మంచినీటి సౌకర్యంతో పాటు.. వర్షం వచ్చినా ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటుచేశారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవాలకు గోల్కొండ ముస్తాబు - స్వాతంత్ర్య దినోత్సవాలు
Independence Day celebrations in Golconda భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని గోల్కొండకోట ముస్తాబైంది. రేపటి ఉత్సవాలకు సంబంధించిన రిహార్సల్స్‌ను ఆదివారం గోల్కొండ కోటలో నిర్వహించారు.
ఆదివారం జరిగిన ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్‌ను అదనపు డీజీ జితేందర్, ఇంటలిజెన్స్ అడిషల్ డీజీ అనిల్ కుమార్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి , వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తదితరులు పరిశీలించారు.
స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలలో భాగంగా రవీంద్రభారతిలో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులచే భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే సారే జహాసే అచ్చా హిందూ సితాహమారా వంటి సంగీత నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దేశభక్తి గీతాలు, మృదంగ- లయ విన్యాసం, దేశభక్తి గీతాలతో పేరిణి, కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు, తబలా-లయ విన్యాసం తదితర ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సాంస్కృతిక శాఖ పేర్కొంది.