కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులను రెండు బోర్డుల పరిధుల్లోకి చేర్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు 2014లో కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పడ్డాయి. వీటి పరిధిని కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంది. దీనిపై పలు దఫాలు చర్చలు జరిగాయి. కేంద్రానికి బోర్డులు ముసాయిదాలను పంపించాయి. అయితే ప్రాజెక్టులవారీగా కేటాయింపులు లేకుండా పరిధిని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించిన తెలంగాణ.. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పు తర్వాతే చేయాలని కోరగా, బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 811 టీఎంసీల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. దీనిపై చివరిసారిగా గత ఏడాది అక్టోబరులో కేంద్ర జల్‌శక్తి మంత్రి ఛైర్మన్‌గా, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్‌లో చర్చ జరిగింది. ఇద్దరు సీఎంల అభిప్రాయాల తర్వాత, బోర్డుల పరిధులపై తామే నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఆ మేరకు తాజా నోటిఫికేషన్ విడుదలైంది. బోర్డు ఛైర్మన్, సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజినీర్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉండకూడదని అందులో పేర్కొన్నారు.
కృషా ప్రాజెక్టులే కీలకం
గోదావరి బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులు లేవు. ట్రైబ్యునల్ కేటాయించిన నీటి వాటాయే పూర్తి స్థాయిలో వినియోగించుకోనందున పెద్దగా ప్రాధాన్యం లేదు. కృష్ణా బేసిన్‌లో మాత్రం పరిస్థితి భిన్నం. ప్రస్తుతం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ నిర్వహణలోనూ, నాగార్జునసాగర్ తెలంగాణ నిర్వహణలోనూ ఉన్నాయి. ఇవన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలోకి వస్తాయి.
కేంద్ర అధికారాలు కూడా బోర్డులకే!
శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు సంబంధించిన నిర్వహణ విధివిధానాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, బోర్డు సంయుక్తంగా తయారు చేయాల్సి ఉంది. నిర్వహణకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలను బోర్డులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం
ప్రాజెక్టుల హెడ్‌వర్క్‌లు, బ్యారేజ్‌లు, రిజర్వాయర్లు, రెగ్యులేటింగ్ నిర్మాణాలు, కెనాల్ నెట్‌వర్క్స్, ట్రాన్స్‌మిషన్ లైన్లు కూడా కృష్ణాబోర్డు పరిధిలోకి వస్తాయని జల్‌శక్తి శాఖ తెలిపింది. ప్రాజెక్టుల నుంచి నీళ్లు, విద్యుదుత్పత్తిని బోర్డే పర్యవేక్షిస్తుంది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ అవార్డు సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాల అమలును బోర్డు చూస్తుంది. నోటిఫికేషన్‌లోని షెడ్యూల్ 2లో పేర్కొన్న ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించే అధికారం కృష్ణాబోర్డుకు ఉంటుంది. అనుమతిలేని ప్రాజెక్టులను నోటిఫికేషన్‌లో పెట్టినంత మాత్రాన వాటికి అనుమతులు ఇచ్చినట్లు కాదని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తితే ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను ఏపీ, తెలంగాణ రెండూ చూసుకోవాలని స్పష్టంచేసింది.
బోర్డు ఏమేమి చేస్తుంది..
- కృష్ణాపై కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు చేస్తుంది. సాంకేతిక అనుమతులు ఇస్తుంది.
- ప్రకృతి వైపరీత్యాలు, కరవులు, వరదల నిర్వహణ విషయంలో రెండు రాష్ట్రాలు ఎలా వ్యవహరించాలో బోర్డే నిర్దేశిస్తుంది.
- విద్యుత్తు, సరఫరా, డిస్ట్రిబ్యూషన్‌ను రెండు రాష్ట్రాలు అమలు చేయాలి.
- ఏదైనా ప్రాజెక్టును రెండు బోర్డులకు ప్రతిపాదించినప్పుడు.. పరిధిపై వివాదం తలెత్తితే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాలి. ఈ విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయం.
గోదావరి బోర్డుకూ ఇవే నిబంధనలు
- కృష్ణా బోర్డుకు వర్తించే నిబంధనలే గోదావరి బోర్డుకూ వర్తిస్తాయి.
- నోటిఫికేషన్ వెలువడిన ఆరునెలల్లోపు రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకు అనుమతి లేని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలి. ఆరు నెలల్లోపు అనుమతులు తీసుకోలేకపోతే నిర్మాణం పూర్తయినా అనుమతులు లేని ప్రాజెక్టులు బంద్ చేయాల్సిందే.
బోర్డు స్వరూపం నిర్ణయాధికారం వాటిదే
- బోర్డుల స్వరూపం ఎలా ఉండాలో నిర్ణయించుకొనే అధికారం వాటికే ఉంటుంది.
- రెండు బోర్డుల పరిధిలో షెడ్యూల్-2లో ఉన్న ఆపరేషనల్ ప్రాజెక్టులు, హెడ్‌వర్క్‌లు, కెనాల్, ట్రాన్సిమిషన్ లైన్లకు సంబంధించిన ఆఫీసు ప్రాంగణాలు, పరికరాలు, ఫర్నిచర్, వాహనాలు, డీపీఆర్‌లు, రికార్డులు, ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఉన్న డాక్యుమెంట్లు, ప్రాజెక్టులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కేఆర్‌ఎంబీ జ్యూరిస్‌డిక్షన్ పరిధిలోకి వస్తాయి.
- విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం అనుమతి పొందని ప్రాజెక్టులను ఈ బోర్డులకు నివేదించకపోతే జల్‌శక్తి శాఖలోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ పరిగణనలోకి తీసుకోదు.
- రోజువారీ ప్రాజెక్టుల నిర్వహణ, భద్రత విషయంలో రెండు బోర్డులకూ కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు సాయం అందిస్తాయి. బోర్డులు నిర్దేశించిన మేరకు ఇవి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన షరతులమేరకు ఇది అమలవుతుంది.
కేంద్ర బలగాల భద్రత
బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలూ భరించాలి. ఉమ్మడి ప్రాజెక్టులు, ఉమ్మడి కాలువల వద్ద కేంద్ర బలగాలను (సి.ఐ.ఎస్.ఎఫ్) నియమించాలన్నది నిర్ణయం. దీంతోపాటు బోర్డులకు 328 మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా. టెలిమెట్రీ, ప్రాజెక్టుల నిర్వహణ.. ఇలా అన్నింటికి భారీ వ్యయమవుతుంది.
కృష్ణాలో ఏయే ప్రాజెక్టులు..
బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులున్న ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి చేరుతాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ.. సుంకేశుల, ముచ్చుమర్రి, కోయిల్‌సాగర్, భీమా, ఆర్డీఎస్, మూసీ, గాజులదిన్నె.. ఇలా మొత్తం 36 ప్రాజెక్టులు బోర్డు పాలనలోకి వస్తాయి. శ్రీశైలం హెడ్‌వర్క్స్ సహా ఆంధ్రప్రదేశ్ నీటిని తీసుకునే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, హంద్రీనీవా, ముచ్చుమర్రి, తెలంగాణలోని కల్వకుర్తి, రెండువైపులా విద్యుత్తు కేంద్రాలు బోర్డు పరిధిలోకే వస్తాయి. నాగార్జునసాగర్ హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువలు, ఎడమ కాలువ కింద రెండు రాష్ట్రాలకు నీటిని అందించే బ్రాంచి కాలువలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కూడా బోర్డు పరిధిలోకి చేరాయి. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు-నగరి, వెలిగొండ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్.ఎల్.బి.సి) కూడా తమ పరిధిలోకి తెచ్చారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను కూడా ఇందులో చేర్చారు.
ఇవీ చూడండి:జలవిద్యుదుత్పత్తి ఆపాలని తెలంగాణకు.. కృష్ణా యాజమాన్య బోర్డు లేఖ!