Gandhi Jayanthi : మహాత్మాగాంధీ 153వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతి సందర్భంగా రాజ్‌భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ మహానేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహత్మా గాంధీ పిలుపు మేరకు హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పెద్దఎత్తున ప్రజలు ఉద్యమంలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం దిశగా నడిచారని గవర్నర్ పేర్కొన్నారు.
స్వాతంత్య్ర యోధులలో ఒకరైన లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతి అని.. ఆయన వినయశీలి, మృదుస్వభావి అయినప్పటికీ బలమైన నాయకుడని గవర్నర్ అన్నారు. "జై జవాన్ జై కిసాన్" అని పిలుపునిచ్చి.. సరిహద్దులను కాపాడాలని.. సంక్షోభ సమయంలో దేశానికి,జవాన్లకు అవసరమైన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలని రైతులకు పిలపునిచ్చారన్నారు.
JAGAN : జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీ చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలు జల్లి ఆయనను స్మరించుకున్నారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఇద్దరూ ఆదర్శవంతమైన ఆలోచనలతో సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చేందుకు పాటుపడ్డారని కొనియాడారు.
CHANDRABABU :జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జన్మదినం సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు నివాళులర్పించారు. ఆ మహనీయులు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మానవుడిని మహాత్మునిగా చేసే సద్గుణాలను తన జీవితం ద్వారా ప్రపంచానికి అందించిన ఉన్నతుడు గాంధీజీ అని చంద్రబాబు అన్నారు. నైతికతే బలంగా ప్రతి సమస్యపై పోరాడి గెలిచిన సత్యాగ్రహి అని పేర్కొన్నారు. గాంధీ జీ జయంతి సందర్భంగా... ఆ మహానుభావుడు ఆశించిన అహింసాయుత, శాంతి సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.