All parties reactions on capital issue: విజయసాయిరెడ్డి, ఆయన పరివారం విశాఖలో వేల కోట్ల ఆస్తులు దోచేశారని.. తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. కంటికి కనిపించిన ఆస్తినల్లా లాక్కుంటున్నా... ఉత్తరాంధ్రకు చెందిన ఒక్క వైకాపా నేత కూడా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని కడితే ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుందంటున్న నాయకులు... విజయసాయి దోపిడీ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
ఉత్తరాంధ్రలో అమరావతి రైతుల పాదయాత్రను వైకాపా ఎలా అడ్డుకుంటుందో చూస్తామన్నారు. ఎవరైనా అడ్డంకులు సృష్టించాలనుకుంటే.. యాత్ర ఎలా జరిపించాలో తమకు తెలుసన్నారు. ఉత్తరాంధ్రలో దేవుడి దర్శనానికి రైతులు వస్తుంటే... వైకాపా నేతల వద్ద వీసా తీసుకోవాలా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి విశాఖను దోచేస్తుంటే మాట్లాడని మంత్రులు, ఇతర నేతలు.. రాజధాని రైతుల పట్ల రెచ్చిపోవడం దారుణమన్నారు.
"రూ.25 వేల కోట్లు ఆస్తులు తనఖా పెట్టడం వాస్తవం. విజయసాయి రూ.10 వేల కోట్ల ఆస్తులు అక్రమించుకున్నారు. వృద్ధుల కోసం వైఎస్ ఇచ్చిన స్థలం కూడా లాక్కున్నారు. భూములిచ్చిన రైతులను దొంగల్లా చూస్తారా? రైతులు వస్తే వారికి పాదాభివందనం చేయాలి. ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్రకు అండగా నిలుస్తాం. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు రైతుల యాత్రను స్వాగతించాలి": -అయ్యన్నపాత్రుడు
మీడియా సంస్థలు, వాటి అధిపతులపై శాసనసభ వేదికగా సీఎం మాట్లాడిన తీరు దారుణమని... తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం... సీఎం స్థాయికి తగునా అని ప్రశ్నించారు. దోపిడీ సొమ్ముతో సాక్షి పత్రిక, టీవీ ఛానెళ్లు ఏర్పాటు చేసిన జగన్‌రెడ్డి.... కష్టార్జితంతో పైకొచ్చిన ఈనాడు గ్రూప్ సహా ఇతర సంస్థలపై మాట్లాడటం ఏమిటని నిలదీశారు. జగన్ సీఎం అయ్యాక ఆయన సొంత కులం సహా ఏ వర్గానికి మేలు జరగలేదన్నారు.