సహజంగా రాజకీయ పార్టీలు ఒక కార్యక్రమానికి పిలుపిస్తే.. ప్రజలు, ఇతర వర్గాలు ఫాలో... అవుతుంటాయి. అమరావతి రైతులు ఆ ట్రెండ్ ఫాలో కాకుండా.. కొత్త ట్రెండ్.. సృష్టించారు. పార్టీలే..తమకుతాముగా వచ్చి స్వచ్ఛంద మద్దతు ప్రకటించేలా ఉద్యమించారు. ఉద్యమంపై.. ఎక్కడా రాజకీయ నీడ పడకుండా పోరాటం.. సాగించారు. మెడలో ఆకుపచ్చ కండువాలు.! చేతిలో జాతీయ జెండాలతో తమది ఒకే అజెండా అని చాటారు.! అందుకే వైకాపా మినహారాజకీయ పార్టీలూ యాత్రకు మద్దతిచ్చాయి.
రాజధానులనేది వైకాపా విధానం.! కానీ.. కొందరు ద్వితీయ శ్రేణి వైకాపా నాయకులు ఒకే రాజధాని అంటూ నినాదాన్ని వినిపించారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఉద్యమకారులకు ఇబ్బందులు సృష్టిస్తే.. కొందరు మండల స్థాయి నేతలు తమ పేర్లు బయటకు రానీయొద్దంటూ.. రైతులకు తోచినసాయం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బస చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి.. ఏ అవసరం వచ్చినా సహకరిస్తానని... ఫోన్‌నంబర్ ఇచ్చి మరీ వెళ్లారు. అమరావతికి ఆయన జైకొట్టకపోయినా.. తమను పలకరించిన వైకాపా తొలి ఎమ్మెల్యే అంటూ.. రైతులు సంతోషపడ్డారు.
వైకాపా పదవుల్లో ఉన్నవారిలో కొందరు బహిరంగంగానే 3 రాజధానులను తప్పుబట్టారు. గూడురు వైకాపా నాయకుడు పోకూరి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసి అమరావతి రైతులకు జైకొట్టారు. వైకాపా రాష్ట్ర అధికారప్రతినిధి.. శ్రీకాళహస్తి బార్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి సురేంద్ర ముదిరాజ్ రైతులకు సంఘీభావం తెలిపారు. ఏర్పేడు మండల వైకాపా బీసీ నేత చంద్రశేఖర్... రాక్షస రాజ్యం పనికిరాదని బాహాటంగానే చెప్పారు.
పాదయాత్ర ఆరంభం నుంచి ముగింపు వరకూ.. తెలుగుదేశం నేతలు రైతులకు పూర్తి వెన్నుదన్నుగా నిలిచారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్ర సాగిన గ్రామాల్లోని నియోజకవర్గ.. తెదేపా ఇంఛార్జ్‌లు చొరవ తీసుకుని.. భోజనం, వసతి వంటి సౌకర్యాలకు సహకారం అందించారు. కొందరు విరాళాల రూపంలో.. ఉదారత చాటుకున్నారు.
వామపక్షాలు, వారి బద్ధశత్రువులుగా ఉండే జనసంఘ్, భాజపా...వేర్వేరుగా ఒకే పోరాటాన్ని.. బలపరిచిన అరుదైన ఉద్యమం అమరావతి.! అమిత్‌షా గీతోపదేశంతో తత్వం బోధపడిన కమలనాథులు మూకుమ్మడిగా...పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. అమరావతి కట్టుబడి ఉన్నామనే భరోసా ఇచ్చారు. ఆ తర్వాత భాజపా కిసాన్ సంఘ్ నేతలు యాత్రకు.. అన్నిగ్రామాల్లో సహకరించారు.
కాంగ్రెస్ నేతలు రేణుకాచౌదరి రైతుల ట్రాక్టర్ నడిపగా.. తులసిరెడ్డి పాదయాత్ర ముగింపులో పాల్గొని.. సంఘీభావం తెలిపారు. వామపక్షాలు, జనసైనికులు.. ఆయా ప్రాంతాల్లో తమకున్న బలాన్ని బట్టి.. పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ వచ్చారు. సీపీఐ నేత నారాయణ.. కాలుకిందపెట్టలేని స్థితిలోనూ వచ్చి యాత్రారథంపై ప్రయాణించారు. అమరావతి ఉద్యమానికి కొందరు వైకాపా నాయకులూ మద్దతివ్వడం.. రైతులకు కొంత నైతికస్థైర్యాన్నిచ్చింది.