ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముస్తాబైన ముచ్చింతల్‌.. నేటి నుంచి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు

By

Published : Feb 2, 2022, 6:19 AM IST

Updated : Feb 2, 2022, 6:32 AM IST

RAMANUJA SAHASRABDI: సమతకు చిహ్నమైన దివ్యమూర్తి శ్రీరామానుజాచార్య.. సహస్రాబ్ది సమారోహానికి తెలంగాణలోని శంషాబాద్‌.. ముచ్చింతల్ దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి 12 రోజులపాటు జరిగే ఉత్సవాలకు జీయర్ ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. చిన్నజీయర్ స్వామి స్వయం పర్యవేక్షణలో జరగనున్న సమతామూర్తి విగ్రహావిష్కరణ.. సాయంత్రం 5 గంటలకు అంకురార్పరణ జరగనుంది. దేశ విదేశాల నుంచి భక్తుల రాకతోపాటు.. రాష్ట్రపతి, ప్రధాని సహా ముఖ్య అతిథులు హాజరుకానున్న ఈ ఉత్సవాలకు ప్రభుత్వం 7 వేల మంది సిబ్బందితో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

RAMANUJA SAHASRABDI
RAMANUJA SAHASRABDI

RAMANUJA SAHASRABDI: కులమతాలకు అతీతంగా సమానత్వ సిద్ధాంతానికి పాటుపడిన జగద్గురు శ్రీ రామానుజాచార్యుల వెయ్యేళ్ల వేడుకలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని శ్రీ రామనగరం ముస్తాబైంది. శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం పేరుతో నేటి నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనున్న ఈ వేడుకల్లో.. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు. 216 అడుగుల ఎత్తున నిర్మించిన రామానుజాచార్య విగ్రహాన్ని వైభవంగా ఆవిష్కరించనున్నారు. స్వయంగా త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ సహస్రాబ్ది వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున లక్ష్మీనారాయణ మహాయజ్ఞం కొనసాగనుంది. 108 దివ్యదేశాల ప్రతిష్టాపన, కుంభాభిషేకం, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ, సమతామూర్తి లోకార్పణ జరగనుంది.

12 రోజుల మహాక్రతువు.. 5 వేల మంది రుత్వికులు..

ఈ 12 రోజుల మహాక్రతువులో ప్రధానమైన యాగశాలలో యజ్ఞాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1035 కుండాలలో మహాయజ్ఞం జరగనుంది. ఈ మహాయాగాన్ని నిర్వహించేందుకు 5 వేల మంది రుత్వికులు ఆశ్రమానికి చేరుకున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, కర్ణాటక సహా అమెరికా నుంచి వచ్చారు. యాగానికి అవసరమైన పదివేల పాత్రలను రాజస్థాన్ నుంచి తెప్పించారు. యాగశాలను.. వాలంటీర్లు అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దారు.

అమెరికా సహా..

ఈ వేడుకల్లో సేవలందించేందుకు వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 12 వేల మంది వాలంటీర్లు వివిధ దశల్లో భక్తులకు సేవలందించనున్నారు. అమెరికాలోని 15 రాష్ట్రాలతోపాటు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 20 జిల్లాలు సహా మరో 18 రాష్ట్రాల నుంచి సేవకులు వచ్చారు. యాగశాల, సమతామూర్తి విగ్రహం, ఆహారశాలలు, మరుగుదొడ్లు వంటి వేర్వేరు చోట్ల వాలంటీర్లు సేవలు అందించనున్నారు.

బుధవారం నుంచి..

ప్రతి రోజు ఉదయం ఆరున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. బుధవారం నుంచి ఉత్సవాల్లో అత్యంత కీలకమైన హోమాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి అరగంట పాటు విష్టు సహస్రనామ పారాయణం ఉంటుంది. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు ముఖ్య అతిథుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి.

7 వేల మంది పోలీసులతో భద్రత..

రామానుజాచార్య ఉత్సవాలకు రాష్ట్రపతి, ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు విశిష్ట అతిథులుగా రానున్నట్లు చినజీయర్ స్వామి వెల్లడించారు. సామాన్యుల నుంచి ధీమాన్యుల వరకు అన్నిరకాల సేవలను అందిస్తూ సమతామూర్తి స్ఫూర్తిని ఆవిష్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణతోపాటు.. సహస్రాబ్ది వేడుకలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 7 వేల మంది పోలీసులు సమతామూర్తి కేంద్రంలో 24 గంటలపాటు పహారా కాయనున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పోలీసులు పూర్తిగా సమతామూర్తి కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రత, భక్తుల సేవ కార్యక్రమాలపై పోలీసులు ఉన్నతాధికారులు, సిబ్బందితో సమీక్షించిన చిన్నజీయర్ స్వామి.. పోలీసులు, వాలంటీర్లు సమన్వయంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీచూడండి:

Last Updated : Feb 2, 2022, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details