ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యంలో సైనైడ్‌ కలిపి దంపతులను హతమార్చాడు - Alcohol mixed with cyanide killed the couple in suryapet dist

ఉదారత చూపిన మిత్రుడి ఉసురు తీసేశాడు. రుణం ఎగ్గొట్టేందుకు దారుణానికి పాల్పడ్డాడు. సాయం చేసిన వ్యక్తిని సైనైడ్‌తో చంపేశాడు. మద్యంతో మృత్యువల పన్నాడు. అది విషమని తెలియక తాగిన దంపతులు క్షణాల్లో కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 13 రోజుల కిందట జరిగిందీ సంఘటన. భార్యాభర్తలవి సహజమరణాలని అప్పట్లో భావించారు. కానీ అవి హత్యలని, కపట స్నేహితుడే కాలయముడని తేలింది.

దంపతులను హతమార్చాడు

By

Published : Nov 17, 2019, 8:43 AM IST

దంపతులను హతమార్చాడు

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలంలోని మొరసకుంట తండాకు చెందిన దంపతులు మూడ్‌ లాల్‌సింగ్‌, లక్కి ఈ నెల మూడో తేదీన హఠాన్మరణం చెందారు. వారి కుమారుడు రాజేష్‌ ఫిర్యాదుతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది. వివరాలను పెన్‌పహాడ్‌ ఎస్సై రంజిత్‌రెడ్డి మీడియాకు వివరించారు.

రాయితీపై ట్రాక్టర్ రుణం...

లాల్‌సింగ్‌ ఎస్టీ కార్పొరేషన్‌లో రాయితీపై ట్రాక్టర్‌ రుణం పొందారు. అదే తండాకు చెందిన పల్లపు దుర్గయ్య రూ.లక్ష లాల్‌సింగ్‌కు ఇస్తానని, రుణ వాయిదాలు తానే చెల్లిస్తానని ఒప్పించి, ట్రాక్టరును తీసుకున్నాడు. అప్పటి నుంచి దుర్గయ్య నార్కట్‌పల్లిలో నివసిస్తున్నాడు.

ఎగవేయాలని భావించి...

రుణం రెండు వాయిదాలు (సుమారు రూ.1.20 లక్షలు) చెల్లించిన అతడు మిగతా ఎనిమిది వాయిదాలు (సుమారు రూ. 6 లక్షలు) ఎగవేయాలని యోచించాడు. రుణం లాల్‌సింగ్‌ పేరుతో ఉన్నందున అతడు మృతి చెందితే డబ్బు చెల్లించనక్కర్లేదని పథకం రచించాడు.

సైనైడ్ దొంగిలించి...

నార్కట్‌పల్లిలో దుర్గయ్య ఇంటి పక్కన బిహార్‌కు చెందిన సర్వర్‌ అనే వ్యక్తి బంగారు వస్తువులు తయారు చేస్తుంటాడు. అతడి వృత్తిలో వినియోగించే సైనైడ్‌ను దుర్గయ్య దొంగిలించాడు. ఈ నెల 3న రాత్రి సైనైడ్‌ కలిపిన మద్యం సీసాను తీసుకొచ్చి లాల్‌సింగ్‌కు ఇచ్చాడు. ఇంటికి వచ్చిన లాల్‌సింగ్‌ భార్య లక్కితో కలిసి మద్యం తాగారు. వెంటనే ఇద్దరూ మృతి చెందారు.

కొడుకుకి సందేహమొచ్చింది.. అసలు విషయం బయటికొచ్చింది

లాల్‌సింగ్‌ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందారని, తట్టుకోలేక భార్య కూడా చనిపోయిందని స్థానికులు భావించారు. వారి కుమారుడు రాజేష్‌ అనుమానంతో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్టరీని ఛేదించారు. నాగారం సీఐ శ్రీనివాస్‌, పెన్‌పహాడ్‌ ఎస్సై రంజిత్‌రెడ్డి నార్కట్‌పల్లి వెళ్లి దుర్గయ్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సూర్యాపేటలో డీఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో నిందితుడిని రిమాండ్‌కు పంపించామని ఎస్సై వివరించారు.

ఒకరి అత్యాశ... ఇద్దరి హత్యకు దారితీసింది. సాయం చేసినవారినే హతమార్చేస్థాయికి దిగజార్చింది. చివరికి కటకటాల పాలుచేసింది. ఈ దుర్ఘటన సహృదయతకే మాయని మచ్చ!

ABOUT THE AUTHOR

...view details