Awareness conference: అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆధునిక యువతులు... ఇంటి ఆహారం తీసుకోవటం ద్వారా మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చునని అక్కినేని ఉమెన్స్ హాస్పటల్ ఛైర్మన్, డాక్టర్ మణి తెలిపారు. విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో అతివల ఆరోగ్య సమస్యలపై ఈటీవీ భారత్- ఈనాడు, అక్కినేని ఉమెన్స్ హాస్పటల్ సంయుక్తంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దుకాణాల్లో దొరికే ఆహారం తీసుకోవడం వల్ల రోగాలు చుట్టుముడుతున్నాయని, సరైన ప్రణాళికతో ఇంటి ఆహారం తీసుకుంటే జబ్బులు దరిచేరవని వైద్యురాలు మణి సూచించారు. రాష్ట్రంలో 52 శాతం మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయని... డాక్టర్ మధుబిందు తెలిపారు. తప్పనిసరిగా ఆహారంలో ఆకుకూరలు, గుడ్లు, మాంసాహారం తీసుకోవాలన్నారు.
ఈతరం అమ్మాయిల్లో ఎక్కువ మంది అధిక రక్తస్రావం, అధిక బరువు, అవాంఛిత రోమాలు వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారని... డాక్టర్ పద్మశ్రీ పేర్కొన్నారు. రుతుక్రమంలో వచ్చే సమస్యలపై చాలా మంది యువతులు గుర్తించలేకపోతున్నారని వైద్యురాలు పార్వతీ తెలిపారు. నెలసరికి సంబంధించిన అంశాలపై యువతులకు కచ్చితంగా అవగాహన అవసరమని సూచించారు.