1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు అజేయ కల్లం వివరించారు. రైతుల ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పారు. రైతులు పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారని కంటి తుడుపు చర్యలు చేపట్టారన్న అజేయ కల్లం... ఎకరం పొలం ఉన్న రైతు రూ.3 లక్షల అప్పుతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఎకరం పంటకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టం వస్తుందని... రైతుల అప్పులకు ప్రధాన కారణం పంట నష్టం కాదని తెలిసిందన్నారు. ఆరోగ్య ఖర్చు, బోర్లు ఎండిపోవడం వంటి పలు కారణాలు ఉన్నాయని వివరించారు.
'రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.7171 కోట్లు జమ' - ajeya kallam comments on chandrababu
రాష్ట్రంలో 12 శాతం అదనపు విద్యుత్ ఉత్పత్తి ఉందని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం చెప్పారు. విద్యుత్ విషయమై కేంద్రం అన్ని రాష్ట్రాలకు ముసాయిదా పంపిందన్న కల్లం... ప్రతి రాష్ట్రం రాయితీలను నేరుగా వినియోగదారులకు అందజేయాలనేది ప్రతిపాదన అని వివరించారు. ముసాయిదాను ఏపీ, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని వివరించారు. కొవిడ్ సమయంలో తమ ప్రతిపాదనకు రాష్ట్రాలు అంగీకరిస్తాయనేది కేంద్రం భావనని పేర్కొన్నారు. డిసెంబర్‌లోపు ఒక్క జిల్లాలోనైనా అమలు చేయాలనేది కేంద్ర ప్రతిపాదన అని చెప్పారు. కేంద్ర ప్రతిపాదన మేరకు ఒక జిల్లాలోనైనా అమలు చేయడంపై యోచిస్తున్నట్టు వివరించారు.
వైఎస్‌ఆర్ పాదయాత్రలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు గుర్తించారని చెప్పుకొచ్చారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం చేపట్టాలని వైఎస్‌ఆర్ నిర్ణయించారన్న అజేయ కల్లం... దేశంలో మొదటిసారిగా ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన ఘనత వైఎస్‌ఆర్‌ది అని వివరించారు. తండ్రి ఆలోచనలను సీఎం జగన్ 2 అడుగులు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను 7 గంటల నుంచి 9 గంటలు చేస్తున్నారని స్పష్టం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిల కింద రూ.7171 కోట్లు జమ చేశామని వివరించారు. గత ప్రభుత్వ హయాం నాటి బకాయిలు చెల్లిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. 'నాడు-నేడు'తో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు.
ఇదీ చదవండీ... అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్