ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 9, 2022, 5:13 PM IST

Updated : Feb 10, 2022, 4:57 AM IST

ETV Bharat / city

సీఎం టూర్​లో పోలీసుల అత్యుత్సాహం.. మూడు గంటలు.. ముప్పుతిప్పలు

CM Jagan Vishaka Tour: ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన సందర్భంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎయిర్​పోర్టుకు వచ్చే రహదారుల్లో 3 గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. పలువురు వాహనాలు దిగి కాలినడకన విమానాశ్రయానికి బయల్దేరారు. సీఎం పర్యటనలో పోలీసుల వైఖరి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎ జగన్​ విశాఖ పర్యటన ప్రజలను తీవ్ర అసౌకర్యం
సీఎ జగన్​ విశాఖ పర్యటన ప్రజలను తీవ్ర అసౌకర్యం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ పర్యటన ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది. మూడు గంటల పాటు ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని నగర ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండుటెండలో ఎక్కడికక్కడ రోడ్డు మీద ఆపేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ బుధవారం విశాఖ శారదా పీఠం వార్షిక వార్షికోత్సవాలకు హాజరుకావడానికి షెడ్యూలు ప్రకారం ఉదయం 11 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా 11.45కు వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు తిరిగి బయల్దేరాలింది.. సాయంత్రం 4 వరకు అక్కడే ఉన్నారు.

అయితే.. తిరుగు ప్రయాణంపై స్పష్టత లేకపోవడంతో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపేశారు. ఎన్‌ఏడీ కూడలి నుంచి పెందుర్తి, కంచరపాలెం, గాజువాక, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వైపు మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎన్‌ఏడీ పైవంతెన కింది భాగం వాహనాలతో కిక్కిరిసిపోయింది. అత్యవసర పనులు, ఆసుపత్రులకు వెళ్లేవారు వాహనాలు దిగి నడుచుకుంటూ వెళ్లారు. వాహనదారులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. హారన్లు మోగిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సమయం మించిపోతుండటం.. పోలీసులు అనుమతించకపోవడంతో లగేజీలతో పరుగులు పెట్టారు. విమానం వెళ్లిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
  • విశ్రాంత అదనపు ఎస్పీ ఎల్వీఎస్‌ రావు... విశాఖ పోలీసు కమిషనర్‌కు వాట్సప్‌ సందేశం పంపారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఎన్‌ఏడీ నుంచి సింహాచలం వెళ్లేందుకు బయటకు రాగా ఇంటికి చేరుకునే సరికి సాయంత్రం 4 గంటలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వీవీఐపీలు వచ్చే సమయంలో 5, 10 నిమిషాలు ట్రాఫిక్‌ నిలిపితే భరించగలమని, గంటల పాటు ఆపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంత అసమర్థ ట్రాఫిక్‌ నిర్వహణను గతంలో ఎన్నడూ చూడలేదని ఆ సందేశంలో తెలిపారు.

దుకాణాలు మూసేశారు గానీ..

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గోపాలపట్నం నుంచి వేపగుంట, సుజాతనగర్‌, చినముషిడివాడల్లో బీఆర్టీఎస్‌ రహదారికి ఇరువైపులా 5 కి.మీ. మేర దుకాణాలను ఉదయం నుంచే మూసివేయించారు. మాంసం దుకాణాలను మూయించడంతో నిర్వాహకులు ఉసూరుమన్నారు. గతంలో రెండుసార్లు సీఎం విశాఖ వచ్చారని, అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడెందుకు ప్రవేశపెట్టారో తెలియడం లేదని వ్యాపారులు వాపోయారు.

  • సాధారణ దుకాణాలను మూయించిన పోలీసులు మద్యం దుకాణాలను వదిలేశారు. వేపగుంటలో 11గంటలకు తెరుచుకున్న మద్యం దుకాణం సీఎం శారదాపీఠానికి వెళ్లేవరకు తెరుచుకునే ఉంది. తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు దాన్ని మూయించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

ఎన్ని గంటలు ఆపేస్తారు?

ఇదేం పద్ధతి... ఇలా వాహనాలు నిలిపేయడం ఏం బాగోలేదు. ఎన్ని గంటల పాటు ఉండాలి? మాకు సొంత పనులు ఉండవా..? నేను ఎక్కడో పోర్టు రోడ్డు నుంచి వస్తున్నా. దారి మొత్తం వాహనాలు నిలిపేశారు. చేసేది లేక ఓ కుర్రాడి సాయంతో ద్విచక్రవాహనంపై ఎయిర్‌పోర్టుకు వస్తే.. మళ్లీ ఇక్కడ ఆపేస్తారా..? ముసలోళ్లు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు ఎందరో విమానాశ్రయానికి రావడానికి దారిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేను ఎయిర్‌పోర్టుకు చేరానో లేదోనని మా అమ్మాయి ఇంటివద్ద కంగారు పడుతోంది. విమానం వెళ్లిపోతే.. మీరు టికెట్‌ డబ్బులు ఇస్తారా? ఇక లాభం లేదు.. విమానం వెళ్లిపోయినా ఫర్వాలేదు. ఇక్కడే ధర్నా చేస్తా’ అని ఓ మహిళ తీవ్రస్థాయిలో విమర్శించారు.

పోలీసుల వైఖరిపై విమాన ప్రయాణికులు, స్థానికుల ఆగ్రహం

ఇదీ చదవండి

శారదాపీఠానికి సీఎం జగన్.. రాజశ్యామల అమ్మవారి ఆలయంలోప్రత్యేక పూజలు

Last Updated : Feb 10, 2022, 4:57 AM IST

ABOUT THE AUTHOR

...view details