ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అలాంటి వారు.. మూడో డోసు వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది!

తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీఎస్‌ఎంసీ) ఆధ్వర్యంలో మంగళవారం ‘కొవిడ్‌ నుంచి నేర్చుకున్న పాఠాలు.. భవిష్యత్‌ వ్యూహాలు’ అనే అంశంపై వెబినార్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రణదీప్‌ గులేరియా ముఖ్య అతిథిగా ప్రసంగించారు. డెల్టా వేరియంట్‌ వైరస్‌పైనా కొవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్లుగా తేలిందన్నారు. ప్రజల్లో టీకాలను పొందడం వల్ల దుష్ఫలితాలు వస్తాయనే అపోహలు పోవాలని, దీనిపై అవగాహన, విశ్వాసం కల్పించాల్సిన అవసరముందన్నారు.

interview
interview

By

Published : Jun 16, 2021, 8:00 AM IST

* కొవిడ్‌ చికిత్స అనంతరం కనీసం ఒక లక్షణంతో సగటున 60 రోజులపాటు బాధపడుతున్నవారున్నారు. 15-87 శాతం మందిలో అలసట చాలా సాధారణ సమస్యగా కనిపిస్తోంది. 7-24 శాతం మంది తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్నారు.
* కొవిడ్‌ చికిత్స అనంతర రక్షణ కూడా చాలా ముఖ్యం. తగినంత నిద్ర తప్పనిసరి. శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాయామాలు కూడా చేయాలి.

- డాక్టర్‌ రణదీప్‌ గులేరియా

* హెర్డ్‌ ఇమ్యూనిటీ రావాలంటే దేశవ్యాప్తంగా రోజుకు కనీసం కోటి మందికి టీకాలను అందించాలి. అలా 3 నెలల పాటు కొనసాగాలి. ఆ స్థాయిలో టీకాల ఉత్పత్తి జరగాలి. మున్ముందు ఎక్కువ కంపెనీలు వస్తే.. ఉత్పత్తి సాధ్యమవుతుంది.

- డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో టీకానే రక్షణగా నిలుస్తుందని దిల్లీ ఎయిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. టీకా వల్ల వైరస్‌ వ్యాప్తి నివారణకు కూడా కొంత ఉపయోగపడుతుందన్నారు. కొవిడ్‌ టీకా పొందిన తర్వాత కూడా ఒకవేళ వైరస్‌ బారినపడితే.. అత్యధికుల్లో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తప్పుతుందన్నారు. కొందరు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినా ఆరోగ్యం విషమం కాకుండా, ముఖ్యంగా ప్రాణాపాయం సంభవించకుండా టీకా రక్షణగా నిలుస్తుందని డాక్టర్‌ గులేరియా స్పష్టంచేశారు.

డెల్టా వేరియంట్‌ వైరస్‌పైనా కొవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్లుగా తేలిందన్నారు. త్వరలో మరికొన్ని టీకాలు కూడా అందుబాటులోకి రానున్నాయనీ, వ్యాక్సిన్‌ సమర్థతపై అన్ని రకాలుగా పరిశోధించిన తర్వాతే కొవిషీల్డ్‌ రెండోడోసును 12-16 వారాల మధ్యలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రజల్లో టీకాలను పొందడం వల్ల దుష్ఫలితాలు వస్తాయనే అపోహలు పోవాలని, దీనిపై అవగాహన, విశ్వాసం కల్పించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీఎస్‌ఎంసీ) ఆధ్వర్యంలో మంగళవారం ‘కొవిడ్‌ నుంచి నేర్చుకున్న పాఠాలు.. భవిష్యత్‌ వ్యూహాలు’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో డాక్టర్‌ రణదీప్‌ గులేరియా ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి టీఎస్‌ఎంసీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఇ.రవీందర్‌రెడ్డి నాయకత్వం వహించగా.. సుమారు 20 రకాల అంశాలపై సదస్సులో వేర్వేరు వైద్యనిపుణులతో చర్చలు నిర్వహించారు.

‘‘గత అనుభవాలను పరిశీలిస్తే.. 1918లో స్పానిష్‌ ఫ్లూ కూడా ప్రధానంగా మూడు దశల్లో విజృంభించింది. తొలిదశ, మూడోదశల్లో కంటే రెండోదశలో తీవ్రంగా విరుచుకుపడింది. దీన్నిబట్టి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కారక వైరస్‌ వ్యాప్తి తీరును అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొవిడ్‌ కూడా రెండోదశలో అధికంగా విజృంభించింది. ఇదే సమయంలో వైరస్‌ కూడా తన స్వభావం మార్చుకొని కొత్త రూపు సంతరించుకుంది. కొత్తగా మార్పు చెందిన వైరస్‌లను గుర్తించగలుగుతున్నాం. తద్వారా వైరస్‌ను ఎదుర్కొనే వ్యూహాలను మార్చుకునే అవకాశం ఏర్పడింది’’ అని డా. రణదీప్‌ గులేరియా వివరించారు.

వారు మూడో డోసు తీసుకుంటే మేలు

* రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలను వాడుతున్నవారు, మధుమేహం నియంత్రణలో లేనివారు రెండు డోసులు పొందిన 8 వారాల తర్వాత మూడో డోసు టీకాను కూడా తీసుకుంటే మేలు.

*కొవిడ్‌ను ప్రధానంగా రెండుదశలుగా విభజించాలి. తొలివారంలో వైరీమియా.. అంటే ఈ రోజుల్లో వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ దశలో లక్షణాలు కనిపిస్తున్నప్పుడు రెమ్‌డెసివిర్‌, మోనోక్లోనల్‌ యాంటీబాడీల తరహా చికిత్సలను అందించాలి.

*రెండోవారంలో సైటోకైన్స్‌ ఉప్పెన. ఇది ప్రమాదకరమైన దశ. ఈరోజుల్లో యాంటీ వైరల్‌ ఔషధాలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. రక్తనాళాలల్లో ఉన్నట్టుండి రక్తం గడ్డకట్టే అవకాశాలు పెరుగుతాయి. దీన్ని నివారించడానికి స్టిరాయిడ్స్‌, టోసిలిజుమాబ్‌, బారిసిటినిబ్‌ వంటి ఔషధాల వినియోగం అవసరం. అయితే స్టిరాయిడ్‌లను మితిమీరి వాడడం వల్ల వృద్ధుల్లో, రక్తంలో చక్కెర నియంత్రణ లేని మధుమేహుల్లో, అధిక రక్తపోటు బాధితుల్లో దీర్ఘకాల కొవిడ్‌ సమస్యలు ఎదురవుతున్నాయి.

*ప్రధానంగా వైరస్‌ బాధితులను ఎటువంటి లక్షణాలు లేనివారు, స్వల్ప, మధ్యస్థ, తీవ్ర, విషమ లక్షణాలున్నవారుగా విభజించాలి. మధ్యస్థ లక్షణాలున్న రోగుల్లో తొలి 7 రోజుల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఉపయోగం. ఈ దశలో రెమ్‌డెసివిర్‌ను ఇవ్వడం వల్ల తీవ్రదశకు చేరుకోకుండా అడ్డుకుంటుంది.

*ఇప్పటివరకూ మా ఆసుపత్రిలో మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ చికిత్సను 50 మంది రోగులకు అందించాం. అందరికీ వారం రోజుల్లో నెగెటివ్‌ వచ్చింది. రెండోదశ కొవిడ్‌లో వైరస్‌ వ్యాప్తికి సుమారు 60 శాతం డెల్టా రకం వైరస్సే కారణమని గుర్తించారు.

-డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు, ఏఐజీ ఛైర్మన్‌

వ్యాక్సిన్‌తో 100 శాతం రక్షణ

టీకాల వల్ల 100 శాతం రక్షణ ఉంటుంది. అయితే చాలామందికి ఇంకా సమర్థతపై నమ్మకం లేక వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నారు. తమకు వ్యాధి నిరోధక శక్తి ఉందని, టీకా అవసరం లేదని భావిస్తున్నారు. ఇది సరి కాదు. వ్యాక్సిన్‌ ఎన్ని రోజులు పని చేస్తుందని నిర్దిష్టంగా చెప్పలేం. అందుబాటులో ఉన్న అధ్యయనాల ప్రకారం 8 నెలల వరకు రక్షణ ఇస్తుంది. ఇప్పటి వరకు వెలువడిన అధ్యయనాల ప్రకారం టీకా తీసుకున్న వారిలో కొవిడ్‌ వచ్చినా 70 శాతం ఆసుపత్రిలో చేరే ముప్పు తప్పింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో మరణాల రేటు భారీగా తగ్గింది. టీకా తీసుకున్న వ్యక్తి ద్వారా ఇతరులకు కరోనా వ్యాప్తి ఆగిపోతుంది. ప్రస్తుతం నోవాక్స్‌, జైకోవిడ్‌-డి, జాన్సన్‌ జాన్సన్‌, భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్లు వివిధ ప్రయోగ దశల్లో ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఎక్కువ మంది జనాభాకు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. హెచ్‌ఐవీ రోగులకు కూడా వ్యాక్సిన్‌ పూర్తి రక్షణ ఇస్తుంది.-డాక్టర్‌ రామన్‌ గంగాఖేత్కర్‌, డైరెక్టర్‌, ఎపిడమాలజీ, ఐసీఎంఆర్‌

ఇదీ చూడండి:

Property tax: కొత్త పన్ను విధానంపై రాష్ట్రవ్యాప్తంగా కలకలం!

ABOUT THE AUTHOR

...view details