AIG Chairman Dr Nageswarareddy: ఒమిక్రాన్ రకం ఊపిరితిత్తులపై చాలా తక్కువ ప్రభావం చూపుతోందని, లక్షణాలు ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం అవుతున్నాయని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యులు స్పష్టం చేశారు. చాలామందిలో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయని పేర్కొన్నారు. 95 శాతం మంది 3-4 రోజులకే కోలుకుంటున్నారని, వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో భారీ స్థాయిలో జరిగిన ఉత్పరివర్తనాల వల్ల వ్యాప్తి అధికంగా ఉంటోందన్నారు. మూడో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒమిక్రాన్ లక్షణాలు.. చికిత్సలు తదితర విషయాలపై శుక్రవారం ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యం వెబినార్ నిర్వహించింది.
తక్కువ స్థాయి మరణాలు...
మూడో దశలో ఆసుపత్రిలో చేరికలు, మరణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయన్నారు. ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో.. అంతే వేగంగా తగ్గిపోతోందని ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి అన్నారు. మార్చి నెల అంతానికి ఎండమిక్ స్థాయికి చేరి, సాధారణ దగ్గు, జలుబు లక్షణాలకే పరిమితం కావొచ్చన్నారు. అయినా, నిర్లక్ష్యం వహించక అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బూస్టర్ డోసుతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి స్పైక్ ప్రొటీన్‌ను నియంత్రిస్తుందన్నారు. వైరస్ సోకినా స్వల్ప లక్షణాలే కన్పిస్తాయన్నారు.