ఇంజినీరింగ్లో కనీస ఫీజు విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సిఫార్సులపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. విద్యాదీవెన కింద ప్రభుత్వం బోధన రుసుములను పూర్తిగా చెల్లిస్తోంది. భారం తగ్గించుకునేందుకు నాలుగేళ్లకు ఒకే ఫీజును నిర్ణయించింది. నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు సవరించాల్సి ఉండగా.. మొదటి ఒక ఏడాదికి ఇచ్చిన వాటినే మరో మూడేళ్లకు పొడిగించారు. వీటి సమయం 2022-23తో ముగుస్తుంది. 2023-24 నుంచి మళ్లీ సవరించాల్సి ఉంది. రాష్ట్రంలో బీటెక్ కోర్సుకు గరిష్ఠంగా ఉన్న ఫీజు కంటే ఏఐసీటీఈ కనీస రుసుములు అధికంగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఉన్నత విద్యాశాఖ యోచిస్తోంది.
ఏఐసీటీఈ ఫీజులను అమలు చేస్తే ప్రభుత్వంపై భారీగా భారం పడుతుంది. వాటిపై లేఖ రాయాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఏఐసీటీఈ సూచించిన కనీస ఫీజు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాయి. బోధన రుసుముల చెల్లింపు పథకం అనేది ప్రభుత్వ విధానమని, దీంతో సంబంధం లేకుండా ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఫీజులను ఖరారు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అధ్యాపకులకు యూజీపీ పే స్కేల్స్ ఇవ్వాలన్నా, నాణ్యమైన విద్య అందించాలన్నా కనీస ఫీజు రూ.75,000 పైనే ఉండాలని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కనీస ఫీజు రూ.35,000 ఉండగా.. గరిష్ఠంగా రూ. 70,000 ఉంది.
గత కొన్నేళ్లుగా డిమాండ్.. :రాష్ట్రం నిర్ణయిస్తున్న ఫీజులు అసమంజసంగా ఉంటున్నాయని ఇంజినీరింగ్ కళాశాలలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కళాశాలల ఆదాయ, వ్యయాల ఆడిట్ నివేదిక ఆధారంగా వీటిని నిర్ణయిస్తున్నారు. వ్యయాల్లో అప్పులపై వడ్డీలు, బోధనేతర సిబ్బంది జీతాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని యాజమాన్యాలు విమర్శిస్తున్నాయి. తెదేపా హయాంలో కనీస రుసుములు రూ.35,000.. గరిష్ఠంగా రూ.1.16 లక్షలుగా ఉండేవి. ఎంసెట్లో 10,000 లోపు ర్యాంకు వచ్చిన వారికి పూర్తిగా బోధన రుసుము చెల్లించేవారు. మిగతా వారికి రూ.35,000 చొప్పున ఇచ్చేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా బోధన రుసుముల చెల్లింపులు అమలు చేసేందుకు ఫీజులను తగ్గించింది. కనీస ఫీజును రూ. 35,000గానే ఉంచి, గరిష్ఠ రుసుమును రూ.70,000కు పరిమితం చేసింది.