రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిసేవనూ ఒకే చోట పొందేందుకు ఏక కేంద్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని అహ్మదాబాద్ ఐఐఎం సిఫారసు చేసింది. దరఖాస్తులు చేసేందుకు, సేవలు పొందేందుకు, దరఖాస్తుల పురోగతి తెలుసుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడాలని పేర్కొంది. యునీక్ ఐడీ ద్వారా పౌరులు తమ డాక్యుమెంట్లను అన్నింటినీ డౌన్‌లోడ్ చేసుకునేలా దీన్ని సిద్ధం చేయాలని సూచించింది. భవనాల క్రమబద్ధీకరణ విధానం (బీపీఎస్) వంటి వాటిని పూర్తిగా తొలగించాలి లేదా లోపాల్ని సరిదిద్దాలంది. ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలనకు సంబంధించి అహ్మదాబాద్ ఐఐఎం సిద్ధం చేసిన అధ్యయన నివేదికను ఆ సంస్థ ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణస్వామి సోమవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అందించారు. అందులో పలు సిఫారసులు చేశారు...
ప్రధానాంశాలివీ...
- ప్రభుత్వ కార్యాలయాల్లో మానవ వనరుల ఆడిట్ నిర్వహించాలి. ప్రతి ఉద్యోగానికీ విధులు, బాధ్యతలను సిద్ధం చేయాలి. జవాబుదారీతనం కోసం ప్రామాణికాల్ని నిర్దేశించాలి. ప్రాధాన్య పోస్టులు, పదోన్నతులు, బదిలీల్లో వ్యత్యాసాలపై దృష్టి సారించాలి.
- దస్త్రాల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అకౌంటింగ్ వ్యవస్థను సమీక్షించాలి. చెల్లింపులు, రసీదుల్లో వ్యత్యాసాలను తొలగించాలి. నిర్వహణ వ్యయాలకు సరిపడా నిధులు కేటాయించాలి.
- అన్ని రిజిస్ట్రీలు, ఆన్‌లైన్ డేటా బేస్‌లను తక్షణమే అప్‌డేట్ చేయాలి. ఐటీ అభివృద్ధి, నిర్వహణలో ఆయా శాఖల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.
- కీలక, ప్రాధాన్య పోస్టుల్లో ఏసీబీ క్లియరెన్స్ ఉన్న వారినే నియమించాలి. కీలక స్థానాల్లో పనిచేసే వారికి నిర్ణీత కాలవ్యవధి(టెన్యూర్)ని నిర్దేశించాలి.
- వార్డు సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్ల విధులు, బాధ్యతలు, అప్పగించిన పనులను కఠినంగా పర్యవేక్షించాలి.
- పరిపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీడియా, స్థానిక రాజకీయ నాయకులు, మాఫియా గూండాలను దూరంగా ఉంచాలి. మీడియాకు సమాచారం కోసం ఒక అధీకృత అధికారిని నియమించాలి.
- నిఘా వేగుల (విజిల్ బ్లోయర్స్) విధానాన్ని ప్రవేశపెట్టాలి.