తెలంగాణ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. సుమారు 8 లక్షల మంది బాధితుల కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. మానవత దృక్పథంతో బాధితులకు సొమ్ము చెల్లించేందుకు అనుమతినిచ్చి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును కోరుతోంది. ఇవాళ జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ ధర్మాసనం అగ్రిగోల్డ్ సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టింది. చిన్న డిపాజిటర్లకు సొమ్ము చెల్లింపుపై అభ్యంతరాలున్నాయా అని ధర్మాసనం ప్రశ్నించగా.. తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గతంలో పది వేల రూపాయలలోపు డిపాజిటర్లకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా డబ్బులు పంపిణీ చేశామని.. అయితే కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంపిణీ ప్రక్రియలో మార్పులు చేస్తున్నట్లు ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరాం తెలిపారు.
కమిటీ ద్వారా పరిశీలన
వార్డు సచివాలయాల సహకారంతో సీఐడీ ఇన్ స్పెక్టర్ గ్రామాలు లేదా మండలాలకు వెళ్లి బాధితులను గుర్తించి క్లెయిమ్ పత్రాలను సేకరిస్తారని పేర్కొన్నారు. క్లెయిమ్ పత్రాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవోలతో కూడిన కమిటీ పరిశీలిస్తుందన్నారు. వారు పంపిన క్లెయిమ్‌లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, కలెక్టర్, సీఐడీ ఎస్పీతో కూడిన కమిటీ వాటిని పరిశీలించి ధ్రువీకరిస్తారని ఏజీ వివరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి డిసెంబరు 31 వరకు డబ్బులు బదిలీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తెలంగాణ హైకోర్టు.. మార్చి 31 వరకు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.