తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి కొత్త శకం ప్రారంభం కానుంది. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా తహసీల్దార్లకు ప్రభుత్వం సంయుక్త సబ్‌రిజిస్ట్రార్ అధికారాలను కల్పించింది. అందుకు అనుగుణంగా అక్టోబర్ 29న మేడ్చల్ జిల్లా మూడుచింతల పల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆ పోర్టల్ ద్వారా మండల పరిధిలోనే రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భూమికొనుగోలుతోపాటు, వివిధ రకాల సేవలు పొందాలని నిర్ణయించుకున్న వారు ఇప్పటికే స్లాట్లు నమోదు చేసుకున్నారు. వాటిని ఇవాళ్టి నుంచి తహసీల్దార్లు ధరణి పోర్టల్‌లో పూర్తి చేయనున్నారు.
అరగంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్
భూ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం మండల స్థాయిలోనే రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆ సేవలు అందుతుండేవి. భూవిక్రయాల సమయంలో రిజిస్ట్రార్ల వద్ద స్లాట్ తీసుకొని అక్కడికి క్రయవిక్రయదారులు, సాక్షులు కలిసి వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తిచేసేవారు. అనంతరం భూయాజమాన్య హక్కులమార్పిడి-మ్యుటేషన్‌కి మరోసారి తహసీల్దార్ కార్యాలయాలను సంప్రదించాల్సి వచ్చేది. 10 రోజుల గడువుతర్వాత మ్యుటేషన్‌పూర్తయ్యేది. 1-బీలో భూ యాజమానుల పేర్లు, భూ విస్తీర్ణాల్లో మార్పులుచేసి పాసుపుస్తకాలు అందించేవారు. ధరణి పోర్టల్ ద్వారా అరగంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తికానుంది. వారం, పది రోజుల వ్యవధిలోనే పాసుపుస్తకం ఇంటికి చేరుతుంది.