ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎరువులు ఎమ్మార్పీ ధరలకే అమ్మాలి: వ్యవసాయ కమిషనర్

ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి... అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని... వ్యవసాయ కమిషనర్ అరుణ్​ కుమార్ హెచ్చరించారు. ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలని స్పష్టం చేశారు.

By

Published : Apr 20, 2021, 8:16 AM IST

fertilizers
ఎరువుల ధరలు

భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే భావనతో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీకంటే అధిక ధరలకు విక్రయించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతోపాటు ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ హెచ్చరించారు. బస్తాలపై ముద్రించిన ధరల ప్రకారమే ఎరువులు అమ్మేలా అన్ని జిల్లాల వ్యవసాయ సంయుక్త సంచాలకులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.

జిల్లాలవారీగా అంతర్గత తనిఖీ బృందాలను ఏర్పాటుచేశామని ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని చిల్లర, హోల్‌సేల్‌, నిల్వ కేంద్రాలను తనిఖీ చేసి ఎమ్మార్పీపై ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. ఎక్కడైనా అధిక ధరలకు అమ్ముతుంటే స్థానిక వ్యవసాయాధికారికి, సమీకృత రైతు సమాచార కేంద్రానికి (టోల్‌ఫ్రీ నెంబరు 155251) ఫిర్యాదు చేయాలని సూచించారు.

రాష్ట్రంలో 6.63 లక్షల టన్నుల నిల్వలు

రాష్ట్రంలో సోమవారంనాటికి 6.63 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఇందులో యూరియా 2.60 లక్షల టన్నులు, కాంప్లెక్స్‌ 2.42 లక్షలు, డీఏపీ 42వేలు, ఎంవోపీ 58వేలు, ఎస్‌ఎస్‌పీ 61వేల టన్నులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 2021 ఖరీఫ్‌ కాలానికి సంబంధించి రాష్ట్రానికి 20.45 లక్షల టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించిందని వివరించారు. యూరియా 8.25 లక్షలు, కాంప్లెక్స్‌ 7 లక్షలు, డీఏపీ 2.50 లక్షలు, ఎంవోపీ 1.5 లక్షలు, ఎస్‌ఎస్‌పీ 1.26 లక్షల టన్నుల ఎరువులు నెలవారీ కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్రానికి సరఫరా అవుతాయని పేర్కొన్నారు.

ఎరువుల నిల్వ, పంపిణీకి సంబంధించి 2021-22 సంవత్సరానికి మార్క్‌ఫెడ్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది. లక్ష టన్నుల యూరియా, 15 వేల టన్నుల డీఏపీ, 25వేల టన్నుల కాంప్లెక్స్‌, 10వేల టన్నుల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌.. కలిపి మొత్తం 1.50 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఉండేలా చూడాలని సూచించింది. ఇందుకు రూ.500 కోట్ల మేర బ్యాంకు రుణం తీసుకునేందుకు అనుమతించింది. ఉత్పత్తివారీగా, నెలవారీ కేటాయింపు, సరఫరా ప్రణాళికను అన్ని జిల్లాల వ్యవసాయ సంయుక్త సంచాలకులకు తెలియజేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోవాలని, ఆర్‌బీకే వారీగా పంటల సాగు, ఎరువుల అవసరాన్ని అంచనా వేసి అందుకు అనుగుణంగా కనీసం 5 టన్నులకు తగ్గకుండా నిల్వ చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:

విశాఖలో 'రెమ్​డెసివిర్​' బ్లాక్​లో విక్రయం.. పలువురు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details