ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ కృష్ణబాబుతో ముఖాముఖి ఏపీ, తెలంగాణల మధ్య అంతర్ రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు ఎట్టేకలకు ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులు నడపాలో స్పష్టత వచ్చింది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు సంతకాలు చేశారు. దీని ప్రకారం ఏపీలో 1,61,258 కి.మీ. మేర టీఎస్ ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ఇక తెలంగాణలో 1,60,999 కి.మీ. మేర 638 బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ నడపనుంది.
ఒప్పందం ప్రకారం ఇలా...
లాక్‌డౌన్‌కు ముందు ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు నిత్యం 1,009 సర్వీసులు నడిపేది. ఇప్పుడు ఆ సంఖ్య 638కే పరిమితమైంది. దీనివల్ల 371 సర్వీసులు తగ్గనున్నాయి. టీఎస్‌ఆర్టీసీ గతంలో ఏపీకి 750 సర్వీసులు నడిపేది. ఇప్పుడు 820 వరకు పెరగనున్నాయి. టీఎస్‌ఆర్టీసీ డిమాండ్ మేరకు 1.61 లక్షల కి.మీ.మేర సర్వీసులకే ఏపీఎస్ ఆర్టీసీ అంగీకరించటంతో ఆర్టీసీల ఎండీల మధ్య సోమవారం ఒప్పందం జరిగింది. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బస్సుల పర్మిట్లపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి, ఉభయ రాష్ట్రాల రవాణాశాఖల ముఖ్య కార్యదర్శుల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగేందుకు మరికొంత సమయం పడుతుందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు, టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు.
తొలి బస్సు విజయవాడ నుంచి
ఒప్పందం కుదరటంతో ఏడు నెలల తర్వాత తెలంగాణకు ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. మొదటగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు వెళ్లాయి. విజయవాడ బస్టాండ్ నుంచి హైదరాబాద్‌లోని మియాపూర్‌కు సూపర్ లగ్జరీ బస్సు మొదట బయలు దేరింది. బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు అప్పటికప్పుడు టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా ఆర్టీసీ ప్రారంభించింది.
7 నెలల సుదీర్ఘ విరామం
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించటంతో మార్చి 23 నుంచి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను సడలించినప్పటికీ ఇవి పునఃప్రారంభానికి నోచుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ బస్సుల రాకపోకల కోసం రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం జరగలేదు. సమన్యాయం ప్రాతిపదికన రెండు రాష్ట్రాలూ కిలోమీటర్లు, సర్వీసులు సమానంగా నడిపేందుకు ఒప్పందం చేసుకున్న తర్వాతే ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు నడపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టం చేయటంతో బస్సులకు బ్రేకులు పడిన విషయం విదితమే. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయటంతో సేవలు పునరుద్ధరించారు.