ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"మా బడి మాక్కావాలి.. మీ విలీనం మాకొద్దు" - schools merge in andhr pradesh

Agitations over Schools merge: పాఠశాలల విలీనంపై రాష్ట్రంవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పాఠశాలల ఎదుట ఆందోళనకు దిగారు. బడులు మూతపడితే.. పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

agitations over schools merge in ap
agitations over schools merge in ap

By

Published : Jul 6, 2022, 4:16 PM IST

Updated : Jul 6, 2022, 5:11 PM IST

"మా బడి మాక్కావాలి.. మీ విలీనం మాకొద్దు"

Protest against over Schools merge in AP: అనంతపురం జిల్లా మాయదారులపల్లలో విద్యార్థులతో కలిసి తల్లితండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ ప్రధాన ద్వారం వద్ద ముళ్ల కంచెలు వేసి గేటుకు తాళం వేశారు. ప్రాథమిక పాఠశాలను పక్కనే బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వల్ల 4 కిలోమీటర్ల దూరం తమ పిల్లలు నడవలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లి ప్రాథమిక పాఠశాలను కూడా వేపులపర్తి ఉన్నత పాఠశాలలో విలీనం చేయకూడదని రెండో రోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడులో తమ పాఠశాలను మూసివేయద్దంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. చదువుతున్న పాఠశాలను వదిలేసి దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్లబోమని విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నినాదాలతో హోరెత్తించారు.

పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేషన్‌పాడుల విద్యార్థులతో కలిసి మహిళలు ధర్నా చేపట్టారు. తమ కాలనీ నుంచి పాఠశాలను తరలించవద్దని ఆందోళన నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం పిండ్రువడ పాఠశాలను అంబావిల్లి పాఠశాలలో విలీనం చేయడంతో విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దూరాభారం వల్ల విద్యార్థులను చదువు మాన్పించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్​ జిల్లా చాపాడు మండలం తిమ్మయ్య గారి పల్లె పాఠశాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పాఠశాల బయటే కూర్చుని నిరసన తెలియజేశారు. పాఠశాల విలీన ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరించు కోవాలని నినాదాలు చేశారు.

నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బలో పాఠశాలకు తల్లితండ్రులు తాళం వేసి ఆందోళన చేపట్టారు. విలీనం పేరుతో జెండాదిబ్బా గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాలను, ఉర్దూ పాఠశాలను అన్నారెడ్డిపాళేం పాఠశాలకు తరలించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం విద్యార్థులు నడిచి వెళ్లలేరని మండిపడ్డారు. వరికుంటపాడు మండలం కాకోలువారిపల్లె ఆదర్శ ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకించారు.

సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో పాఠశాల గేటుకు తాళం వేసి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. పాఠశాలలో ప్రస్తుతం 150 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని.. దూరంగా ఉన్న పాఠశాలలో విలీనం చేయడం వల్ల నడిచివెళ్లలేరని ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిర నగర పంచాయితీ పరిధిలోని బేగార్లపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల గేటుకు ముళ్ల కంపలు వేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు.. గ్రామం నుంచి మడకశిర పట్టణంలోని వైఎస్ఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల విద్యాధికారి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు వినతిపత్రం అందించారు. మా సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించి పాఠశాల విలీనం ఆపాలన్నారు. లేకపోతే మా పిల్లలను బడులను మానిపిస్తామని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లిలో ప్రాథమిక పాఠశాలను స్థానికంగా ఉండే ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. చిన్నపిల్లలు రోడ్డుదాటి వెళ్లలేరంటూ ఆందోళన నిర్వహించారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం చాట్రగడ్డలోని ఎయిడెడ్ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాల మూత పడితే పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. 65 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సనాతన వేదాంత నిష్టాశ్రమ ఉన్నత పాఠశాలను ఇక్కడే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 6, 2022, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details