ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430.. మీడియా సంస్థలు, పాత్రికేయులను బెదిరించేందుకే ఉద్దేశించినట్లు కనిపిస్తోందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ చంద్రమౌళీకుమార్ ప్రసాద్ పునరుద్ఘాటించారు. ఈ జీవోపై సత్వరం చర్యలు తీసుకోవాలని కోరుతూ తనను కలిసిన ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడంపై ప్రతినిధులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
పత్రికలు అవాస్తవ కథనాలు, వార్తలు రాస్తున్నాయని భావిస్తే వ్యక్తులు లేదా ప్రభుత్వ సంస్థలు ఫిర్యాదు చేయొచ్చని, వాటిపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ సిద్ధంగా ఉందని జస్టిస్ ప్రసాద్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా జీవోలు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో విలేకరి సత్యనారాయణ హత్యకు సంబంధించి ప్రభుత్వ, పోలీసు నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని.. నివేదిక రాకుంటే త్వరలోనే స్వీయ నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఛైర్మన్‌ను కలిసిన బృందంలో ఐజేయూ నేతలు కె.అమర్‌నాథ్, అంబటి ఆంజనేయులు, ఆలపాటి సురేశ్‌కుమార్, దూసనపూడి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు ఉన్నారు.