agency villages: తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్తు స్తంభాలు నేలకొరగడం, గ్రామాలు నీటమునగడంతో నాలుగైదు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు సరఫరా చేయలేని పరిస్థితి తలెత్తింది. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాలకు రవాణా అవకాశాల్లేకపోవడంతో స్థానిక దుకాణాల్లో నిత్యావసర సరకులు నిండుకుంటున్నాయి.
* ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో వాగులు పొంగడంతో దాదాపు 200కు పైగా గిరిజన గ్రామాలు, ఆవాసాలు నీటిలో చిక్కుకున్నాయి. ఉట్నూరు, నార్నూరు, జైనూరు, సిరికొండ, సిర్పూర్(యు), బోథ్ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్‌లో బుగ్గవాగు పొంగి, కల్వర్టు కొట్టుకుపోవడంతో తిర్యాణికి సంబంధాలు తెగిపోయాయి. ఏజెన్సీలో అయిదు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.