ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇప్పటికిప్పుడే పీపీఏలను రద్దు చేయం: ఏజీ - ppa

గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్​ కొనుగోలు ఒప్పందాలపై(పీపీఏ) సమీక్షించేందుకు సంప్రదింపుల కమిటీ ఏర్పాటు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 36పై హైకోర్టులో విచారణ జరిగింది. జీవోను సవాలు చేస్తూ విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యాల్ని కొట్టివేయాలని ఏజీ అభ్యర్థించారు. గత ప్రభుత్వ  హయాంలో జరిగిన పీపీఏలను సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానానికి వివరించారు.

హైకోర్టు

By

Published : Sep 14, 2019, 6:12 AM IST

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించేందుకు ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమించటం తప్పుకాదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టులో శుక్రవారం వాదనలు వినిపించారు. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలను సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలను సంప్రదింపులకు ఆహ్వానించకుండా తాము ఏపీ విద్యుత్ నియంత్రణ మండలిని ఆశ్రయిస్తే ఏకపక్షమవుతుందన్నారు. అందుకే సంప్రదింపులకు రావాలని విద్యుత్ ఉత్పత్తి సంస్థలను కోరామన్నారు. విద్యుత్ చట్ట నిబంధనల్లోనూ సంప్రదింపులకు ఆహ్వానించటంపై నిషేధం లేదని వివరించారు. పిటిషనర్లు ఆందోళన చెందతున్నట్లుగా ఇప్పటికిప్పుడు ఏకపక్షంగా పీపీఏలను రద్దుచేసే పరిస్థితి తలెత్తదని స్పష్టం చేశారు. పీపీఏలతో ముడిపడి ఉన్న అంశాలు ఏపీఈఆర్సీ ముందు విచారించాల్సినవి అని అన్నారు. ఈఆర్సీని ఆశ్రయించే అవకాశం పిటిషనర్​, సంస్థలకు ఉందని వెల్లడించారు. జీవోను సవాలు చేస్తూ పిటిషనర్ సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యాల్ని కొట్టేయాలని అభ్యర్థించారు.

కమిటీ నివేదిక సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేత

గత ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలను సమీక్షించేందుకు సంప్రదింపుల కమిటీ ఏర్పాటు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 36ను సవాలు చేస్తూ, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఆ జీవోతో పాటు అందుకు అనుగుణంగా ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖ అమలును కొన్ని రోజుల క్రితం హైకోర్టు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ వ్యాజ్యాలపై శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఏజీ వాదనలు కొనసాగిస్తూ పీపీఏలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. కమిటీ నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేశారు. 63శాతం పవన విద్యుత్​ను మూడు ప్రైవేటు కంపెనీలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. "బకాయిలు చెల్లించటం లేదని, బెదిరింపులకు పాల్పడుతున్నారని పిటిషనర్ సంస్థలు ఆరోపిస్తున్నాయి కదా ?" అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు ఏజీ బదులిచ్చారు. గత ప్రభుత్వ హయాంలోనూ బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఏజీ వాదనలపై విద్యుత్ సంస్థల తరపు న్యాయవాదుల ప్రతి వాదనల కోసం విచారణను ఈనెల 18 న్యాయమూర్తి వాయిదా వేశారు.

For All Latest Updates

TAGGED:

ppahighcourt

ABOUT THE AUTHOR

...view details