తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఈ విద్యా సంవత్సరం (2021-22) భారీగా పెరిగింది. 1 నుంచి ఇంటర్ వరకు 1,14,415 మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి వివిధ సర్కారు పాఠశాలల్లో చేరినట్లు విద్యాశాఖ శుక్రవారం వెల్లడించింది. సర్కారులో సాధారణ పాఠశాలలతో పాటు విద్యాశాఖ పరిధిలోని మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో వీరంతా ప్రవేశాలు పొందారు. మోడల్ పాఠశాలలు, కేజీబీవీల్లో ఇంటర్ బోధన ఉన్న విషయం తెలిసిందే. ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 2019-20లో 68,813 కాగా.. గత ఏడాది (2020-21) దాదాపు లక్ష మంది మారి ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి. గతేడాదికి సంబంధించి కచ్చితమైన గణాంకాలను వెల్లడించలేదు. కరోనా మహమ్మారి కారణంగా కుటుంబాల ఆదాయాలు తగ్గడం, ప్రైవేట్లో ఆన్లైన్ తరగతులకూ భారీగా రుసుములు వసూలు చేస్తుండడంతో ఈ వలస మొదలైందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
వివిధ శాఖల పరిధిలో నడుస్తున్న గురుకులాల్లో 5, ఇతర తరగతుల్లో చేరే వారి సంఖ్యనూ పరిగణనలోకి తీసుకుంటే వలస వచ్చిన విద్యార్థుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే సర్కారు బడుల నుంచి ఎంత మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేరారు? ఎంత మంది చదువు మానేశారన్న లెక్కల్ని విద్యాశాఖ సేకరించలేదు.