Capital Issue in High Court: ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాన్ని' రద్దు ' చేస్తూ రాష్ట్రప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో రాజధాని అమరావతి వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాల్లో ఎన్ని అభ్యర్థనలు నిరర్థకం అయ్యాయి? ఎన్ని వ్యాజ్యాల్లో అభ్యర్థనలు ఇంకా మనుగడలో ఉన్నాయో తెలుసుకొవాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం నిర్ణయించింది. ఈ అంశానికి సంబంధించి పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పది రోజుల్లో కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. ఆ నోట్ పై రాష్ట్ర ప్రభుత్వం స్పందన తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. ఆ వివరాల ఆధారంగా ఏ వ్యాజ్యాల్లో, ఏ అభ్యర్ధనలపై విచారణ కొనసాగించాలో ఓ స్పష్టత వస్తుందని అభిప్రాయం వ్యక్తంచేసింది. రాజధాని అమరావతి అభివృద్ధికి గతంలో ఇచ్చిన యథాతథ స్థితి ఉత్తర్వులు అడ్డంకి కాదని, కార్యాలయాల తరలింపును నిలుపుదల చేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. రాజధాని అమరావతి వ్యవహారంపై దాఖలైన పలు వ్యాజ్యాల్లో విచారణ జనవరి 28 కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి , జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.
రాజధాని వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలపై నవంబర్ 29 న విచారణ జరిపిన ధర్మాసనం.. సీఆర్డీఏ రద్దు చట్టం , మూడు రాజధానుల చట్టాన్ని ' రద్దు ' చేస్తూ చట్టసభ తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ సమ్మతి తెలపాల్సి ఉన్న నేపథ్యంలో తదుపరి పురోగతి తెలుసుకునేందుకు విచారణను డిసెంబర్ 27 కు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తూ .. ఆ రెండు చట్టాల రద్దుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారని, ఈ వ్యవహారంపై తీసుకొచ్చిన చట్టం 11 / 12 ను గెజిట్ ప్రకటన చేశామని తెలిపింది. రాజధాని వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం ముందుకు తాజాగా విచారణకు వచ్చాయి. కొంతమంది పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ వాదనలు వినిపిస్తూ .. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం మరో చట్టం చేసిన నేపథ్యంలో తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మాత్రమే నిరర్థకం అయ్యాయన్నారు. పలు అంశాల్లో ప్రభుత్వ నిర్వహించాల్సిన బాధ్యత అలాగే పెండిగ్లో ఉందన్నారు. రాజధాని అమరావతి బృహత్తర ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ప్రాధాన్యత క్రమంగా అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు , భూసమీకరణ పథకం లేవుట్ల అభివృద్ధికి 2020 ఆగస్టు 13న ముఖ్యమంత్రి ఆమోదించినా ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పనులు జరడం లేదన్నారు. కేవలం కాగితాలకే పరిమితమైందన్నారు. రాజధాని అమరావతిగా ఓసారి నిర్ణయం తీసుకున్నాక దానిని మార్చే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదన్నారు. రాజధాని నిర్మించి అందులో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి బృహత్తర ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అప్పగించాలన్నారు.
మరికొందరు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ ప్రసాద్, జంధ్యాల రవిశంకర్, న్యాయవాదులు సురేశ్, ఉన్నం మురళీధరరావు, డీఎస్ఎన్వీ ప్రసాదబాబు, పీఏకే కిశోర్, వాసిరెడ్డి ప్రభునాథ్, అంబటి సుధాకరరావు.. తదితరులు వాదనలు వినిపించారు. మూడు రాజధానులకు మళ్లీ చట్టం తెస్తామని క్యాబినెట్ మంత్రులు చెబుతున్నారన్నారు. ఆ విధమైన చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఈ వ్యవహారం అంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలోదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పలుమార్లు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని గతంలో ప్రకటించారన్నారు. మళ్లీ మూడు రాజధానుల చట్టం తెస్తామన్న షరతుతో పాలన వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేయడం సరికాదన్నారు. మూడు రాజధానుల చట్టం తెచ్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వంచనకు పాల్పడిందన్నారు. హైకోర్టు శాశ్వత భవనాన్ని నిర్మించేలా ఆదేశించాలని కోరారు. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం ప్రత్యక్షంగా చేయలేని దానిని పరోక్షంగా చేస్తోందన్నారు. వక్ఫ్ ట్రైబ్యునల్ కర్నూలులో ఏర్పాటు చేశారన్నారు. రాజధాని విషయమై విశాఖలో సమాంతరంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం .. వ్యాజ్యాల్లో ఏవిధమైన అభ్యర్థనలు, వాటిలో ఎన్ని నిరర్థకం అయ్యాయి? ఎన్నింటిలో విచారణ కొనసాగించాల్సి ఉందో తెలుసుకునేందుకు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కేసుల వారీగా నోట్ తయారు చేసి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. విచారణను జనవరి 28 కి వాయిదా వేసింది .
Capital Issue in High Court: రాజధాని కేసులపై ఏఏ వ్యాజ్యాలపై విచారణ కొనసాగించాలి ? - capital issue
Capital Issue in High Court: రాజధాని కేసులపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. జనవరి 28న పూర్తిస్థాయి వాదనలు వింటామని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్లపై విచారణ కొనసాగాలని రైతుల తరఫు న్యాయవాది శ్యాం దివాన్ ధర్మాసనాన్ని కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.. కేసు వివరాలు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పది రోజుల్లోగా రైతుల తరఫు నోట్‌పై స్పందన తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.
రాజధాని కేసులపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ వాయిదా
Last Updated : Dec 28, 2021, 3:06 AM IST