తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో.. వరుణుడు భీభత్సం సృష్టించాడు. రాష్ట్రంలోనే అత్యధికంగా కుమురం భీం జిల్లా వాంకిడిలో 36.15.సెం.మీ. వర్షం నమోదైంది. ఆసిఫాబాద్‌లో 31.48 సెం.మీ., వెంకట్రావ్‌పేటలో 19.30 సెం.మీ., నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండలంలో 16.65 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల్లో వరద ఉద్ధృతి తగ్గడం వల్ల గేట్లను మూసివేసినప్పటికీ... దిగువన ఉన్న మంచిర్యాల జిల్లా పరిధిలోని ఎల్లంపల్లి జలాశయంలోకి 8.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో పెరిగింది. 40 గేట్లు నాలుగు మీటర్ల చొప్పున ఎత్తి 875 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఎల్లంపల్లి పూర్తి స్థాయి నీటి మట్టం 20 టీఎంసీలు కాగా నిన్న 19.5 టీఎంసీలు ఉంచిన అధికారులు... ఈరోజు 16.58 టీఎంసీల వద్ద ఉంచుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో...
నేరడిగొండ, బోథ్, ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవెల్లి మండలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో వరద కారణంగా దాదాపుగా పదివేల ఎకరాల పంట నీటమునిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనావేసింది. బోథ్ మండలంలోని ముంపు గ్రామాలను జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సందర్శించారు. మండలంలోని ధనోరా, నక్కలవాడ, కరత్వాడ ప్రాజెక్ట్, పోచేరా జలపాతాలను సందర్శించారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లలో అధికారయంత్రాంగం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది.
నిర్మల్ జిల్లాలో...
వర్షం జోరు కాస్తంత తగ్గుముఖం పట్టినప్పటికీ... భారీ నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 40 చెరువులకు గండిపడగా... దాదాపు 500 విద్యుత్ స్తంభాలు, మరో 50 వరకు ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించిన వంతెనలు, రహదారులు కోతకు గురవ్వడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు. నిర్మల్ పట్టణంలోని జీఎన్‌ఆర్ కాలనీ, సారంగపూర్ మండలంలోని గోపాల్‌పేట్, బోరిగాం, దుర్గానగర్ తాండా, అడెల్లి, స్వర్ణ, వంజర, యాకర్‌పల్లి గ్రామాలను పరిశీలించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
దీనస్థితిలో గుండేగాం ప్రజలు..
జిల్లాలోని భైంసా మండలంలో నిర్మించిన పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్‌లోని బ్యాక్ వాటర్ గ్రామాల్లోకి చేరి ఇళ్లను ముంచెత్తాయి. గుండేగాం దిగువన కోతుల్‌గాం- వాడి శివారుల్లో చిన్నసుద్దవాగుపై నిర్మించిన ఈ ప్రాజెక్టులోని.. ఎగువ నుంచి భారీగా వరద రావటం వల్ల బ్యాక్‌వాటర్ గుండేగాంలోకి చేరింది. సామగ్రి, నిత్యావసరాలు తడిసి పోయాయి. మూటాముల్లె సర్ధుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం స్థానికులకు కష్టతరం కాగా.. అక్కడే ఉన్న పాఠశాలలో తలదాచుకున్నారు.
గుండేగాం బాధితుల ఆందోళన...
వరదలు వచ్చినపుడల్లా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పునరావాసం ఏర్పాటు చేసిన దగ్గర రాస్తారోకో నిర్వహించారు. న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు.