తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలో ఓ బాధిత కుటుంబాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరామర్శించారు. రెండు రోజుల క్రితం పర్సువాడకు చెందిన గర్భిణీ సరైన సమయానికి వైద్యం అందక మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఐటీడీఏ అధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూనికాసా గోండ్‌గూడ నుంచి కోలాంగూడ వాగును కాలినడకన దాటి గ్రామానికి చేరుకున్నారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గర్భిణి రాజుబాయి మృతికి ఎదురైన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గాదిగూడ పీహెచ్‌సీలో సిబ్బంది ఉండి ఉంటే బతికేదని కుటుంబీకులు, గ్రామస్థులు పాలనాధికారి వద్ద వాపోయారు. ఈ విషయమై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుని నివేదికను సమర్పించాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాఠోడ్‌ను కలెక్టర్ ఆదేశించారు.