ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం - సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన

Secunderabad Fire Accident : సికింద్రాబాద్‌లో రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని రూబీ లాడ్జ్‌లో ఘటన జరిగింది. సెల్లార్‌లో ఎలక్ట్రికల్‌ ద్విచక్రవాహనాల బ్యాటరీలు పేలి మంటలు పైన ఉన్న లాడ్జీలోకి వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు.

Secunderabad fire accident
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన

By

Published : Sep 13, 2022, 1:02 PM IST

Updated : Sep 13, 2022, 6:53 PM IST

సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం

Secunderabad Fire Accident : సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. మృతుల్లో ఏడుగురు పురుషులు, మహిళ ఉన్నారు. వీరి వయసు 35 నుంచి 40 ఏళ్లలోపు అని సమాచారం. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు.

Secunderabad Fire Accident updates : మృతుల్లో విజయవాడకు చెందిన ఎ.హరీశ్‌, చెన్నై వాసి సీతారామన్‌, దిల్లీ వాసి వీతేంద్ర ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. ఓ ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూంలో చెలరేగిన మంటలతో.. పైఅంతస్తుల్లో ఉన్న లాడ్జిలో పర్యాటకులు ప్రమాదం బారిన పడ్డారు. పొగ దట్టంగా వ్యాపించి పలువురు స్పృహ కోల్పోయి లాడ్జిలోని గదులు, ఆవరణలో పడి ఉన్నారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మోండా మార్కెట్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ సంఘటనకు వివరాలు ఇలా ఉన్నాయి.

లాడ్జిలో 25 మంది పర్యాటకులు..లాడ్జిలో 23 గదులున్నాయి. దాదాపు25 మంది పర్యాటకులున్నట్లు అంచనా. ప్రమాదంతో ఒక్కసారిగా హోటల్‌లోని పర్యాటకులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో హాహాకారాలు చేయసాగారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో ఏమైందోనని భయాందోళనకు గురయ్యారు. వాహనాల నుంచి వెలువడిన పొగ కారణంగా ఊపిరి ఆడక కొందరు స్పృహ తప్పి లాడ్జి గదులలో, కారిడార్‌లో పడిపోయారు. దట్టంగా పొగచూరడంతో శ్వాస తీసుకునే పరిస్థితి లేక ఏడుగురు పర్యాటకులు చనిపోయారు. మంటలు అంటుకుని నలుగురు, ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కిందికి దూకి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు అగ్నిమాపక శాఖాధికారులు హైడ్రాలిక్‌ క్రేన్‌ రప్పించి లాడ్జిలో చిక్కుకున్న వారిని కాపాడే చర్యలు చేపట్టారు.

గాంధీ ఆసుపత్రిలో చికిత్స..క్షతగాత్రులను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాలిన గాయాలు ఎక్కువగా ఉండటంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. 30 మంది వైద్యులు అందుబాటులో ఉండి చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ రాజారావు వివరించారు.

ప్రమాదస్థలిని పరిశీలించిన మంత్రులు..ఘటన విషయం తెలుసుకుని మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే సాయన్న చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, క్షతగాత్రులను గాంధీ, యశోద ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. నగర సీపీ ఆనంద్‌, అగ్నిమాపక శాఖ అదనపు డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌, డీసీపీ చందనాదీప్తి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చుట్టుపక్కల భవనాలు ఉండటంతో మంటలు వ్యాపిస్తాయన్న ఆందోళనతో ముందుగానే పోలీసులు ఖాళీ చేయించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 13, 2022, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details