గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను మాన్యువల్ విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ... కొందరు అభ్యర్థులు హైకోర్టులో అదనపు అఫడివింట్ దాఖలు చేశారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి, రెండోసారి దిద్దించారని అందులో పేర్కొన్నారు. నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందన్నారు. ‘2018 నోటిఫికేషన్‌కు సంబంధించిన గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను స్కాన్ చేసి ‘డిజిటల్’ విధానంలో దిద్దినట్లు, ప్రత్యేక షీట్‌లో మార్కులు వేసినట్లు ఏపీపీఎస్సీ గతంలో సింగిల్ జడ్జికి తెలిపిందన్నారు. జబాబుపత్రాలతో ఉన్న ఓఎంఆర్ షీట్లను డిజిటల్ మూల్యాంకనంలో వినియోగించలేదని తేటతెల్లమవుతోందని.... వాటిని 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య జరిగిన తొలి మాన్యువల్ మూల్యాంకనంలో వినియోగించారని అఫిడవిట్‌లో వివరించారు.
రెండోసారి దిద్దించడం కోసం... పాత బార్‌కోడ్‌తోనే కొత్త ఓఎంఆర్ షీట్లు, కంట్రోల్ బండిల్ స్లిప్పుల ముద్రణకు ఏపీపీఎస్సీ ఆర్డర్లు ఇచ్చిందన్నారు. 2022 ఫిబ్రవరి, మార్చి, మే నెలల్లో డేటాటెక్ మెథడిక్స్ అనే ప్రైవేట్ సంస్థకు ఏపీపీఎస్సీ కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం 49వేల ఓఎంఆర్ బార్ కోడ్ షీట్లు, 6వేల 300 కంట్రోల్ బండిల్ స్లిప్పులు ఆర్డర్ చేసిందన్నారు. ఏపీపీఎస్సీ అప్పటి కార్యదర్శి ఫిబ్రవరి 2న డేటాటెక్ సంస్థకు ఇచ్చిన వర్క్ ఆర్డర్లో... జవాబుపత్రాలను ఓసారి దిద్దడం పూర్తయిందని, మరోసారి దిద్దే ప్రక్రియ ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తవుతుందని ప్రస్తావించారన్నారు. మూల్యాంకనం తర్వాతి ప్రక్రియను చేపట్టాలని కోరారని... లేఖలోని అంశాలను బట్టి తొలి మాన్యువల్ మూల్యాంకనం ఫిబ్రవరి రెండో వారానికే పూర్తయిందని స్పష్టమవుతోందని హైకోర్టు నివేదించారు.