కరోనా ఆపత్కాలంలో సాయమడిగిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తూ రియల్ హీరోగా మారిన ప్రముఖ నటుడు సోనూసూద్.. తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్ రమేశ్‌లతో కలిసి హైదరాబాద్‌లో కేటీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులు, సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో ముచ్చటించారు.
చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోన్న సోనూకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలను ఇలాగే కొనసాగించాలని కోరారు.
గతంలోనూ..
గతంలోనూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సోనూసూద్‌పై ప్రశంసలు కురిపించారు. సాయం అడిగిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న సోనూ.. రియల్ హీరో అంటూ కొనియాడారు. ఈ గొప్ప పనిని ఇలాగే కొనసాగించాలని కోరారు.
ఏం జరిగిందంటే..
నందకిశోర్ అనే వ్యక్తి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కోసం మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. అతనికి కావాల్సిన సాయాన్ని అందజేశారు. అడిగిన వెంటనే స్పందించి తనకు సాయం చేసిన కేటీఆర్‌కు నందకిశోర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు మీరు హీరో అంటూ కొనియాడారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. నేను ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని.. వారికి సేవ చేయడం నా బాధ్యత అని తెలిపారు. ఎలాంటి పదవి లేకున్నా.. ఏం ఆశించకుండా ఆపదలో ఉన్నవారికి నిస్వార్థంగా సేవ చేస్తున్న సోనూసూద్ అసలైన హీరో అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.