NAGABABU: సినిమా పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం సంకుచిత ధోరణితో ప్రవర్తిస్తోందని సినీ నటుడు నాగబాబు తెలిపారు. పవన్ కల్యాణ్‌పై కక్ష సాధించడం కోసమే ‘భీమ్లానాయక్’ రిలీజ్ నేపథ్యంలో సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవో రిలీజ్ చేయలేదని ఆయన పరోక్షంగా అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘మా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే దమ్ముందా మీకు’ అంటూ ఆయన రిలీజ్ చేసిన వీడియోలో ఏపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఇకనైనా.. మంచి పాలన చేయాలని ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారు.
‘‘గత కొద్దికాలంగా సినిమా టికెట్ల విషయంలో వైకాపా ప్రభుత్వం, మంత్రులు విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. సినిమా పరిశ్రమలోని కార్యకలాపాలపై వాళ్లకు ఎలాంటి అవగాహన లేదు. కాబట్టి వాళ్లని నేను ఏం అనలేను. సామాన్యుడికీ సినిమా టికెట్ ధరలు అందుబాటులోకి రావాలని మీరు అంటున్నారు. దాన్ని నేనూ అంగీకరిస్తా. కానీ, మన సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలంటే దాన్ని తెరకెక్కించడంలో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. నటీనటుల పారితోషికాలు సినిమాకి పెట్టిన ఖర్చులో భాగం కాదని మీరు అంటున్నారు. సినిమాకి పెట్టే మొత్తం ఖర్చులో కేవలం 12 నుంచి 20శాతం మాత్రమే హీరోలకు పారితోషికంగా ఇస్తాం. ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోవాలి. తమ సినిమా కనుక పరాజయం పొందితే హీరోలు పారితోషికాన్ని తగ్గించుకుంటారు. కొన్నిసార్లు వెనక్కి ఇచ్చేస్తారు. మా అన్నయ్య, పవన్, ఎన్టీఆర్, మహేశ్, ప్రభాస్.. ఇలా ఎంతోమంది హీరోలు.. తమ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడనప్పుడు నిర్మాతకు బాసటగా ఉండటానికి పారితోషికాన్ని తగ్గించుకున్నవారే. కానీ వాళ్లు ఆ విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. సినిమా అనేది ఒక వ్యాపారం. హీరోలను ఆధారంగా చేసుకునే ఆ బిజినెస్ జరుగుతుంది’’
‘‘మీకున్న వ్యక్తిగత అజెండాల కారణంగా పవన్‌ని అణగదొక్కేయాలనో, లేదా సినిమా పరిశ్రమలో కొంతమంది హీరోలను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనో ప్లాన్ చేస్తున్నారు. దాని కోసమే మీరు పరిశ్రమపై పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ వ్యాపారాన్నైనా మీ చేతుల్లోకే తీసుకుంటున్నారు కదా.. అలాగే సినిమా పరిశ్రమని సైతం ఆంధ్రా వరకూ మీరే తీసుకోండి. వెల్లంపల్లి, కొడాలి వంటి వారిని హీరోలుగా పెట్టి సినిమాలు చేయండి. వాళ్లు బాగా నటిస్తారు. ఆ నటన ముందు మేము ఏ మాత్రం సరిపోం. లేదంటే ఆంధ్రాలో తెలుగు సినిమాలు బ్యాన్ చేసేయండి. కొన్నిరోజులు నష్టపోతాం. వేరే దారి చూసుకుని మా సినిమాలు విడుదల చేస్తాం. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. యూట్యూబ్, ఓటీటీ ఎలా చూసుకున్న మాకు డబ్బులు వస్తాయి’’
‘‘చిరంజీవి పెద్ద మనిషి తరహాలో వెళ్లి జగన్‌తో మాట్లాడారు. దానికి ముఖ్యమంత్రి కూడా సుముఖంగా స్పందించారు. దాన్ని నేను కాదనడం లేదు. కానీ జీవో ఇవ్వడానికి ఇంత ఆలస్యమేమిటి? పాత జీవోని అమలు చేయకుండా.. మధ్యలో మీరు తీసుకువచ్చిన జీవో చెల్లదని తెలిసి కూడా దాని ప్రకారమే టికెట్లు అమ్మడం ఏమిటి? ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం వల్ల కల్యాణ్‌బాబు, లేదా మేము మీ వద్దకు వచ్చి బతిమలాడుకుంటానుకుంటున్నారా? అలా జరగదు’’