రాజధాని రైతుల మీద తప్పుడు వ్యాఖ్యలు చేసే అధికార పార్టీ నాయకులు... గదుల్లో కాకుండా ఓసారి రాజధాని ప్రాంతంలో సమావేశం పెట్టి మాట్లాడాలని.. సినీనటుడు, జనసేన నాయకుడు నాగబాబు సవాల్ విసిరారు. అప్పుడు రాజధాని ప్రజలు మీకు చేసే సన్మానం చూడాలని ఉందని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. కులం ఎప్పుడూ చెడ్డది కాదని... మనుషుల్లోనే మంచివారు, చెడ్డవారు ఉంటారన్నారు. కులాలమీద పగబట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఎవరికీ మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
యూదుల మీద పగబట్టి వాళ్ళ జాతిని నాశనం చేసిన హిట్లర్ నాశనమయ్యాడని... ముఖ్యమంత్రి జగన్ ఆ తప్పు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాజధాని రైతుల పోరాటం ప్రశంసనీయమని కొనియాడారు. వారి పోరాటం వృథా కాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు.