తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్రంలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలను విపక్ష పార్టీల నాయకులు సమర్థించగా.. అధికార పార్టీనేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఏపీలోనే కరెంట్ కోతలు ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ఫైర్: కేటీఆర్ వ్యాఖ్యలపై కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారికి ముఖ్యమని.. కేటీఆర్ ఎందుకు అలా మాట్లాడారో తెలియదన్నారు. ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు సరిగా లేవని ఎవరు చెప్పారో పేరు చెప్పాలని కేటీఆర్‌ను కోరారు. ఏపీలోని నాడు నేడులో ఉన్న పాఠశాలలు, ఆస్పత్రులు..తెలంగాణలో ఉన్నయా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
కేటీఆర్ వాస్తవాలే చెప్పారు:రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో అవాస్తవాలు ఏమున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, విద్యుత్ చార్జీలు, కోతలపై కేటీఆర్ వాస్తవాలే చెప్పారన్నారు. ఇదే విషయాన్ని మేం పదేపదే చెప్పినా స్పందించని మంత్రులు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మూకుమ్మడిగా మైకుల ముందుకొచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు.
పక్క రాష్ట్రాలతో పోల్చితే ఈ రాష్ట్రంలో ప్రతి వస్తువుపై ధరలను విపరీతంగా పెంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాల ధరలను పెంచుతూ ప్రజలను హింసిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు విద్యుత్ ఉండాల్సిన రాష్ట్రంలో కోతలు ఎందుకు చేయాల్సి వస్తుందని నిలదీశారు. పెంచిన ధరలు, విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. మే 9న సచివాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.